మదనపల్లి తరహా ఘటన : యూట్యూబ్ లో చూసి సర్పదోషం పేరుతో కూతురి గొంతు కోసిన ప్రైవేట్ టీచర్

మదనపల్లి తరహా ఘటన : సర్పదోషం పేరుతో కూతురి గొంతు కోసిన ప్రైవేట్ టీచర్

మీకేం పోయేకాలం వచ్చిందా.. మీరు మనుషులేనా.. కన్న తల్లులేనా.. తండ్రులేనా . అసలు మనుషులేనా అనే అనుమానం రోజురోజుకు అందరికీ పెరిగిపోతుంది. వరసగా జరుగుతున్న ఊహించని ఘటనలు.. మనుషుల్లోని మూఢ నమ్మకాలు, క్రూరత్వాన్ని ప్రపంచానికి చాటుతున్నారు. వేలాది మందికి ఉన్నత విద్యాబుద్ధులు చెప్పిన ప్రొఫెసర్లు కన్న కూతుళ్లను అత్యంత కిరాతకంగా చంపేశారు. చిత్తూరు జిల్లా మధనపల్లిలో జరిగిన ఈ ఘటన ప్రపంచాన్ని కదిలించింది.

అలాంటి తరహాలోనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. సూర్యపేట జిల్లా మోతె గ్రామంలో.. సర్పదోషం ఉందన్న కారణంగా.. ఆరు నెలల కన్న కూతురిని బలి ఇచ్చింది కన్న తల్లి. భారతి అనే ఆ తల్లి చదువుకున్నది ఏంటో తెలుసా.. బీఈడీ.. ప్రైవేట్ టీచర్ గా కూడా పని చేసిందంట. ఇప్పుడు గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతుంది.

ఇంత చదువుకుంది.. నలుగురికి మంచి చెప్పాల్సిన భారతి.. మూఢ నమ్మకాల మాయలో పడింది. సర్పదోషం, నాగ దోషం అంటూ పూజలు చేయటమే కాకుండా.. వాటి పరిహారం కోసం సాధువుల నుంచి సలహాలు తీసుకునేది. ఇటీవల యూట్యూబ్ లో సర్పదోషం నివారణకు ఏం చేయాలో చూసింది. బలి ఇస్తే అన్ని దోషాలు పోతాయని తెలుసుకుంది.

ఏప్రిల్ 15వ తేదీ అర్థారాత్రి.. ఇంట్లో దేవుడి ఫొటో ముందు తన ఆరు నెలల చిన్నారిని పడుకోబెట్టి.. కత్తితో గొంతు కోసి చంపింది. ఆ తర్వాత దోషం పోయిందని.. ఇక అంతా మంచే జరుగుతుంది అంటూ కేకలు వేసింది. ఇంట్లో భర్త లేడు.. కేకలు విని చుట్టుపక్కల వాళ్లు, బంధువులు వచ్చి చూసేసరికి ఆరు నెలల చిన్నారి గొంతు నుంచి రక్తం కారుతూ ఉంది. ఆస్పత్రికి తీసుకెళితే అప్పటికే చనిపోయింది ఆ పాపం. ఆ పాప ఎంత ముద్దుగా ఉందో.. చూస్తూ.. చూస్తూ ఎలా గొంతుకోసింది అనే అందరూ చర్చించుకుంటున్నారు.

మూఢ నమ్మకాలు, మూఢ భక్తి ముసుగులో కన్నోళ్లను కడతేర్చుతున్నారు తల్లిదండ్రులు. మొన్నటికి మొన్న మధనపల్లిలో ఇద్దరు కూతుళ్లను చంపేశారు.. ఇప్పుడు మోతెలో మరో కూతురిని తల్లే చంపేసింది..

అసలు మనం మనుషులమేనా.. ఏం పోయేకావలం వచ్చింది ఈ మనుషులకు…

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు