తెలంగాణలో నిప్పుల ఊరు – బతికింటే చాలంటూ ఊరు వదిలిపోతున్న జనం

massive heat in telangana village

అది తెలంగాణ రాష్ట్రంలోని ఓ ఊరు. నిత్యం వేలాది మంది కార్మికులతో ఎంతో హడావిడిగా.. సందడిగా ఉంటుంది.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మండే ఎండలతో నిప్పుల వాన పడుతుందా అన్నట్లు తయారైంది ఆ ఊరి పరిస్థితి. ఏప్రిల్ నెలలోనే ఇలా ఉంటే.. మే నెలలో ఎలా ఉంటుందో అనే భయంతో ఊరు నుంచి వెళ్లిపోతున్నారు జనం.

తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు పట్టణం పరిస్థితి ఇది. ఈ ప్రాంతంలో ఎటు చూసినా ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులే. ఈ ప్రాంతంలో నమోదు అవుతున్న ఉష్ణోగ్రతలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏప్రిల్ ఒకటో తేదీనే 43.3 డిగ్రీలు నమోదు అయ్యింది. ఏప్రిల్ 8వ తేదీ వరకు ప్రతి రోజూ 40 డిగ్రీలకు తక్కువ కాకుండా ఉష్ణోగ్రతలు నమోదు కావటంతో.. మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆందోళన నెలకొంది.

మెగాస్టార్ చిరంజీవి.. ఆచార్య సినిమా షూటింగ్ ఈ ప్రాంతంలోనే పెట్టుకున్నారు. ఎండ దెబ్బకు షూటింగ్ ప్యాకప్ చెప్పి వెళ్లిపోయారు. ఇక లోకల్ పీపుల్ అయితే.. ఉద్యోగం, ఉపాధి పొందుతున్న వారు.. వారి కుటుంబ సభ్యులను ఇతర ప్రాంతాల్లో ఉన్న బంధువుల ఇంటికి పంపిస్తున్నారు. ఎండలు తగ్గిన తర్వాత కుటుంబ సభ్యులను తీసుకురావొచ్చని అంటున్నారు.

ఏప్రిల్ 8వ తేదీ అత్యధికంగా 45 డిగ్రీలు నమోదు కావటం.. ఇది దేశంలోనే అత్యధిక నమోదు కావటం ప్రభుత్వాన్ని సైతం టెన్షన్ కు గురి చేసింది. గతంలో ఈ ప్రాంతంలో చలువ పందిళ్లు, మజ్జిక కేంద్రాలు భారీ ఎత్తున ఏర్పాటు చేసేవారు స్వచ్చంధ సంస్థలు, ప్రభుత్వం. కరోనా కారణంగా స్వచ్చంధ సంస్థలు ముందుకు రాకపోగా.. ప్రభుత్వం సైతం ఈసారి ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. ఈ పరిణామాలతో కార్మికుల ఆరోగ్యంపై ఎండ తీవ్రత తీవ్రంగా పడుతుంది. చాలా మంది వడదెబ్బతో అనారోగ్యం బారిన పడుతున్నారు.

ఎండ దెబ్బ నుంచి బొగ్గు గనుల్లో పని చేసే ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులను కాపాడేందుకు పని వేళలు మార్చాలనే డిమాండ్ ఉంది. ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.. మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు.. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు షిఫ్ట్ టైమింగ్స్ మార్చాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. దీని వల్ల మధ్యాహ్నం సమయంలో తీవ్రంగా ఉండే ఎండ నుంచి తప్పించుకోవచ్చంటున్నారు.

ఏమైనా ఇల్లందులో నిప్పుల వాన పడుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు.. ఏప్రిల్ 8వ తేదీ 45 డిగ్రీలు అంటే.. మే నెలలో 50 డిగ్రీలకు వెళ్లినా వెళ్లొచ్చు అని అంచనా వేస్తున్నారు

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు