జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు అప్రమత్తంగా ఉండండి – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు

పరిషత్ పోలింగ్.. జెడ్పీటీసీ, ఎంపిటీసీ ఎన్నికలపై హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే ఇచ్చిన క్రమంలో.. ఎన్నికలు వాయిదా పడ్డాయన్న ఉద్దేశంతో ఎవరూ అశ్రద్ధగా ఉండొద్దు.. పార్టీ అభ్యర్థులు అందరూ అప్రమత్తంగా ఉండండి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతోపాటు బరిలో ఉన్న అభ్యర్థులు అందరికీ సమాచారం ఇచ్చింది.

పరిషత్ ఎన్నికల నిర్వహణపై వచ్చిన స్టేను సవాల్ చేస్తూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ తీర్పు కోసం అత్యవసర విచారణ కింద పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై ఏ క్షణమైనా తీర్పు రావొచ్చని.. ఏప్రిల్ 6వ తేదీ అర్థరాత్రి లేదా ఏప్రిల్ 7వ తేదీ ఉదయం అయినా తీర్పు రావొచ్చని వివరించింది. ఏప్రిల్ 8వ తేదీ పోలింగ్ జరుగుతుందన్న ఉద్దేశంతోనే అభ్యర్థులు అందరూ అప్రమత్తంగా ఉండాలని.. ఎవరూ డీలా పడొద్దని సూచించింది.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ప్రచారం ఏప్రిల్ 6వ తేదీ అంటే.. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. అంటే 8వ తేదీ ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. సరిగ్గా ఇక్కడే హైకోర్టు స్టే ఇవ్వటం అధికార పార్టీని షాక్ కు గురి చేసింది. పోలింగ్ సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలింపు ప్రక్రియ ప్రారంభం అయిన సమయంలో స్టే రావటంతో ఎన్నికల సంఘం సైతం షాక్ అయ్యింది.

ఇక్కడో మరో అంశం ఏంటంటే.. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి దాఖలు చేసిన పిటీషన్ పై విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్.. కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని ఎక్కడా ఆదేశాలు జారీ చేయలేదు. నోటిఫికేషన్ యధావిధిగా ఉంటుందని.. కాకపోతే నాలుగు వారాల గడువు ఇవ్వాలని మాత్రమే ఆదేశించింది. దీనిపై ఎస్ఈసీ విబేధిస్తోంది. ఏడాది క్రితం ఇచ్చిన నోటిఫికేషన్ ఇది.. నాలుగు వారాలు ఏంటీ.. 13 నెలలు గడువు ఇచ్చినట్లు ఉంది కదా అంటోంది.

ఎవరి వాదన ఎలా ఉన్నా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అప్రమత్తం అయ్యింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను అలర్ట్ చేసింది. పోలింగ్ కు సిద్ధంగా ఉన్నట్లే భావించాలని.. అశ్రద్ధ, నిర్లక్ష్యం వద్దని స్పష్టం చేసింది. పోలింగ్ లేదనే ఉద్దేశంతో తమ వ్యూహాలను పక్కన పెట్టొద్దని సూచించింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు