కరోనాతో చనిపోతే తీసుకెళ్లటం లేదు.. కుళ్లిపోయిన 1,100 శవాలు.. ఎక్కడున్నాం మనం

కరోనా వస్తే అంతేనా.. వదిలేయటమేనా.. కనీసం ఎలా ఉన్నారని కూడా పలకరించరా.. ఆస్పత్రికి వెళితే ఇక అటు నుంచి అటేనా.. తేడా వచ్చి చచ్చిపోతే కనీసం మృతదేహం సైతం తీసుకెళ్లటం లేదా.. ఇవన్నీ అబద్దాలు కావు.. పచ్చి నిజం. కర్ణాటక రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన ఘటన ప్రపంచాన్ని సైతం దిగ్భాంతికి గురి చేస్తోంది.

కరోనా సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత కర్ణాటక రాష్ట్రంలో కేసులు విపరీతంగా పెరిగాయి. రోజుకు 50 వేల కేసులు సైతం వచ్చాయి.. రోజుకు వెయ్యి మందిపైనే చనిపోయాయి. ఇవన్నీ అధికారిక లెక్కలు మాత్రమే. నెల రోజులుగా కర్ణాటక రాష్ట్రంలో కరోనాతో ఆస్పత్రిలో చనిపోతే కనీసం మృతదేహాన్ని తీసుకెళ్లటానికి ఎవరూ రావటం లేదంట. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసినా స్పందించటం లేదు. ఇలా వదిలేసిన మృతదేహాలు ఎన్నో తెలుసా.. అక్షరాల 11 వందలు..

అనాథ శవాలుగా ఉన్న ఇవన్నీ మార్చురీలో కుళ్లిపోతుండటంతో.. రాష్ట్ర ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందు కోసం బెంగళూరు నగర శివార్లలోని ఓ ప్రభుత్వ స్థలంలో ఈ 11 వందల కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు.

కర్ణాటక రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఆశోక్ అయితే 566 మంది అస్థికలను గంగా నదిలో కలిపారు. ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని.. సాయం చేస్తామని చెప్పినా.. కరోనా మృతదేహాలను తీసుకెళ్లటానికి కుటుంబ సభ్యులు, బంధువులు ముందుకు రాలేదని.. దీంతో ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహించినా.. అస్థికలను గంగా నదిలో కలిపిందన్నారు మంత్రి.

మానవత్వం ఏ స్థాయికి దిగజారింది.. కరోనా ఎంతలా భయపెడుతుంది అనటానికి ఇదే నిదర్శనం.. మనం ఎక్కడున్నాం.. ఎటు పోతున్నాం అనటానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం.. నిజం నిప్పు లాంటిది కాదు.. నిజం శవం లాంటిది అని కరోనా నిరూపించింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు