భారతదేశం మరో ఇటలీ అవుతుంది : ఒకే రోజు 2 లక్షల కరోనా కేసులు- చప్పట్లు కొట్టాల్సిన సమయం కాదు -సెల్ఫ్ లాక్ డౌన్ కావాల్సిందే..

covid cases in india are at sudden hike

భారతదేశంలో మరో ఇటలీ అవుతుంది.. కాదు అయ్యింది. దేశంలో కరోనా విలయ తాండం చేస్తోంది. ఏప్రిల్ 14వ తేదీ ఒక్క రోజే రెండు లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. వెయ్యి 38 మంది చనిపోయారు.

ఏప్రిల్ 15వ తేదీ ఉదయం 10 గంటల సమయానికి.. దేశంలో కోటి 40 లక్షల 74 వేల 564 మంది కరోనా బారిన పడగా.. వీరిలో కోటి 24 లక్షల 29 వేల 564 మంది కోలుకున్నారు. ఇంకా దేశంలో 14 లక్షల 71 వేల 877 మంది కరోనాకు చికిత్స తీసుకుంటూ ఉన్నారు. ఇప్పటి వరకు లక్షా 73 వేల 123 మంది చనిపోయారు. దేశంలో కరోనా వ్యాప్తి ప్రమాదకర స్థాయిలో ఉంటే.. వ్యాక్సిన్ వేసింది ఎంత మందికో తెలుసా.. కేవలం 11 కోట్ల 44 లక్షల 93 వేల 238 మందికి మాత్రమే. ఇంకా 120 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉంది.

ఏప్రిల్ 5వ తేదీ దేశవ్యాప్తంగా ఒక రోజులో లక్షా 3 వేల కేసులు నమోదు అయితే.. ఏప్రిల్ 15వ తేదీ నాటికి ఒక రోజులో 2 లక్షల 739 కేసులు నమోదయ్యాయి. కేవలం 10 రోజుల్లోనే కేసులు డబుల్ అయ్యాయి. మరణాల సంఖ్య 70 శాతం పెరిగింది. ఏప్రిల్ 5వ తేదీన కరోనాతో 478 మంది చనిపోతే.. ఏప్రిల్ 14వ తేదీన వెయ్యి 38 మంది చనిపోయారు. మరణాల సంఖ్య ఎక్కువగా నమోదు కావటం కలకలం రేపుతోంది.

ఏపీలో 4 వేల కేసులు నమోదైతే.. తెలంగాణలో 3 వేల కేసులు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో మరణాల సంఖ్య తక్కువగా ఉన్నా.. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. ఆస్పత్రుల్లో బెడ్స్ దొరకటం లేదు బాధితులకు. గతం కంటే భిన్నంగా.. లక్షణాల లేకుండానే.. బయటపడకుండానే కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయికి చేరిపోయింది అని ఈ అంకెలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రభుత్వాలు లాక్ డౌన్ పెట్టే ఉద్దేశంలో లేవు.. ఆంక్షలు మాత్రమే విధిస్తున్నాయి. ఈ సమయంలో జనం చేయాల్సింది ఏంటో తెలుసా.. సెల్ఫ్ లాక్ డౌన్.. ఎవరికి వారు.. లాక్ డౌన్ కావాల్సిన సమయం వచ్చేసింది.. ఆలస్యం అయితే మీ ప్రాణాలకు గ్యారెంటీ లేదు అని కరోనా కచ్చితం చెబుతోంది.. ఇక మీ ఇష్టం.. కరోనాను ఆహ్వానిస్తారా లేదా అనేది..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు