తల్లికి నెగెటివ్.. అప్పుడే పుట్టిన బిడ్డకు పాజిటివ్- దేశంలో ఫస్ట్ టైం ఇదేలా సాధ్యం అనేదానిపై పరిశోధనలు..

కరోనా వైరస్ రూపం రోజురోజుకు మారిపోతూ ఉంది.. మ్యూటేషన్ వల్ల అది ఎలా.. ఎప్పుడు.. ఎవరిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు శాస్త్రవేత్తలు. డాక్టర్లను సైతం షాక్ కు గురి చేసిన ఓ ఘటన మహారాష్ట్ర చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్ర రాష్ట్రం పాలగర్ ప్రాంతానికి చెందిన అశ్విన్ కటేలా అనే 32 ఏళ్ల మహిళ నిండు గర్భిణిగా ఆస్పత్రికి వచ్చింది. పరీక్షలు చేయగా కరోనా నెగెటివ్ వచ్చింది. ఎలాంటి ప్రమాదం లేదని నిర్థారణకు వచ్చిన జవహర్ రూరల్ ఆస్పత్రి వైద్యులు డెలివరీ చేశారు. పండంటి పాప పుట్టింది. పుట్టిన తర్వాత తల్లీ బిడ్డకు మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు.

ఆశ్చర్యమైన విషయం ఏంటంటే.. తల్లికి మళ్లీ నెగెటివ్ వచ్చింది.. అప్పుడే పుట్టిన బిడ్డకు మాత్రం కరోనా పాజిటివ్ అని తేలింది. ఎక్కడో ఏదో తేడా వచ్చి ఉంటుందని భావించిన డాక్టర్లు.. మళ్లీ కరోనా పరీక్ష చేశారు. అప్పటికి మూడు సార్లు తల్లికి నెగెటివ్ వచ్చింది.. బిడ్డకు రెండో సారి టెస్ట్ చేసినా పాజిటివ్ వచ్చింది. షాక్ అయిన డాక్టర్లను బిడ్డను వెంటనే.. సమీపంలోని ప్రభుత్వ కాటేజ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

ఈ విషయాన్ని మహారాష్ట్ర వైద్య శాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు డాక్టర్లు. ఇదెలా సాధ్యం అయ్యిందనే విషయంపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు. తల్లికి కరోనా లేకుండా బిడ్డకు పాజిటివ్ ఎలా వచ్చింది.. అది కూడా గర్భంలో ఉండగా అనేది ఎవరికీ అంతుపట్టటం లేదు.

ఈ అంశంపై సీరియస్ గా దృష్టి పెట్టిన వైద్య శాఖ.. ముగ్గురు డాక్టర్ల బృందంతో తల్లి, బిడ్డల ఆరోగ్యాన్ని దగ్గరుండి పర్యవేక్షించటంతోపాటు.. మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారు. తల్లికి కరోనా లేకుండా కడుపులోని బిడ్డకు పాజిటివ్ ఎలా వచ్చింది అనేది మరికొన్ని తేల్చనున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు