235 మంది కరోనా పేషెంట్ల ప్రాణాలు కాపాడిన పోలీసులు : సినిమా సీన్ తలపించేలా యాక్షన్ -10 నిమిషాలు ఆలస్యం అయితే అందరూ చచ్చిపోయేవారు

కళ్ల ముందు ఒక్క ప్రాణం పోతుంటేనే విలవిలాడిపోతాం.. అలాంటిది 235 మంది కరోనా పేషెంట్లు ప్రాణాల్లో గాల్లో దీపాలు అయ్యాయి. ఏ క్షణమైనా ఆ 235 మంది ప్రాణాలు పోవచ్చు.. ఈ విషయాన్ని గమనించి ఆస్పత్రి యాజమాన్యం ఎలాగైనా ప్రాణాలు కాపాడాలని నిర్ణయించింది.

ఈ 235 మంది కరోనా పేషెంట్లు ఢిల్లీలోని బాలాజీ యాక్షన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి దగ్గర ఆక్సిజన్ అయిపోవచ్చింది. మరో గంట మాత్రమే వస్తుందని డాక్టర్లు డిసైడ్ అయ్యారు. మరి ఆక్సీజన్ లేదా అంటే.. ఉంది.. రెండు ట్యాంకర్లకు ఆర్డర్ ఇచ్చారు. 14 వేల లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్, మరో 5 వేల 500 లీటర్ల గ్యాస్ ఆక్సిజన్ ఆర్డర్ రెడీగా ఉంది. కాకపోతే ఆ రెండు ట్యాంకర్లు ఢిల్లీ సరిహద్దుల్లోని ఫరిదాబాద్ దగ్గర చిక్కుకుపోయాయి. నైట్ కర్ఫ్యూ కారణంగా ఏర్పడిన ట్రాఫిక్ జాం వల్ల నిలిచిపోయాయి. డ్రైవర్లకు ఫోన్ చేస్తే రేపు ఉదయమే అంటూ సమాధానం వచ్చింది.

బాలాజీ ఆస్పత్రి యాజమాన్యం వెంటనే స్పందించింది. ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చింది. మరో గంటలో ఆక్సిజన్ అయిపోతుందని.. 235 మంది ప్రాణాలు పోతాయని.. ట్యాంకర్లు ఫరిదాబాద్ దగ్గర ఇరుక్కుపోయాయని చెప్పారు. వెంటనే స్పందించిన ఢిల్లీ పోలీస్ ఉన్నతాధికారి.. వెంటనే రెండు టీమ్స్ ఏర్పాటు చేశాడు. ట్యాంకర్ డ్రైవర్ల ఫోన్ నెంబర్లు పోలీసులకు ఇచ్చారు.

వాయు వేగంతో స్పందించిన ఢిల్లీ పోలీసులు.. ఫరిదాబాద్ బోర్డర్ నుంచి ఢిల్లీలోని బాలాజీ ఆస్పత్రి వరకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయాలని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. ఇదేదో పెద్ద విషయంగా ఉందని భావించిన లోకల్ పోలీసులు అందరూ.. నైట్ కర్ఫ్యూ కారణంగా ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించారు. రూట్ మొత్తాన్ని క్లియర్ చేశారు. ఓ వైపు ఈ పనులు జరుగుతున్న సమయంలోనే.. మరో వైపు బోర్డర్ లో చిక్కుకుపోయిన రెండు ట్యాంకర్లను ఓ పోలీస్ టీం.. బయటకు తీసుకొచ్చింది.

ఆక్సిజన్ ట్యాంకర్ల ముందూ వెనకా పైలెట్ గా పోలీస్ వాహనాలు సైరన్ మోగిస్తూ.. 80 కిలోమీటర్ల వేగంతో.. 30 నిమిషాల్లో ఆస్పత్రికి ట్యాంకర్లను చేర్చారు. అప్పటి మరో అర గంట సమయం మాత్రమే ఉంది. ఆస్పత్రి డాక్టర్లు, ఇతర సిబ్బంది అంతా వెంటనే ట్యాంకర్లలోని ఆక్సిజన్ ను ఆస్పత్రిలోకి పంప్ చేశారు. ఆక్సిజన్ సరఫరాకు గ్యాప్ లేకుండా చేశారు.

మరో 10 నిమిషాలు ఆలస్యం అయ్యి ఉంటే.. 235 మంది కరోనా పేషెంట్లు ఆక్సిజన్ లేకపోవటం వల్ల చనిపోయేవారని.. ఢిల్లీ పోలీసులు స్పందించిన తీరుకు ధన్యవాదాలు చెప్పింది ఆస్పత్రి యాజమాన్యం. సోమవారం రాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు