గో కరోనా గో అంటూ కాగడాల ర్యాలీ.. మీరు మారుతారనుకోవటం మా తప్పే..

go corona rally with lights

దేశంలో కరోనా కేసులు ఒక్క రోజులోనే 3 లక్షల 14 వేలకు చేరాయి.. ఆక్సిజన్ లేదు.. బెడ్స్ లేవు.. మందులు లేవు.. అయినా జనంలో మార్పు రాలేదు.. మధ్యప్రదేశ్ రాష్ట్రం మాల్వా జిల్లాల్లో బీజేపీకి చెందిన కార్యకర్తలు,.. స్థానిక బీజేపీ లీడర్ రాందాస్ ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ చేపట్టారు. గో కరోనా గో అంటూ నినాదాలు చేస్తూ.. కాగడాల ర్యాలీ నిర్వహించారు.

అగ్నితో కరోనా చచ్చిపోతుందంటూ ఈ విధమైన ర్యాలీ చేయటం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. నిజంగానే నిప్పుతో కరోనా పోయేటట్టు అయితే ఇన్ని ఆస్పత్రులు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు డాక్టర్లు. అధికార బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో.. ప్రజలను చైతన్యం చేయాల్సిన నేతలు.. మూఢ నమ్మకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఇలాంటి చర్యలకు దిగటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ఏప్రిల్ 18వ తేదీ ఆదివారం రాత్రి మాల్వా జిల్లాలోని చాలా గ్రామాల్లో ఇలాంటి కాగడాల ర్యాలీ నిర్వహించిన బీజేపీ నేతల బాగోతం ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ ర్యాలీ సందర్భంగా ఓ ఇల్లు తగలబడిపోయింది కూడా. ఒక్క ఆదివారం మాత్రమే కాదు.. కొన్ని గ్రామాల్లో బుధవారం రాత్రి కూడా గో కరోనా గో అంటూ కాగడాల ర్యాలీ నిర్వహించటం విడ్డూరంగా ఉంది.

గతంలో దీపాలు వెలిగించటం, చప్పట్లు కొట్టటం వరకు చూశాం.. రెండో దశలో ఏకంగా కాగడాలతో కరోనాను చంపాలని చూస్తున్న వారిని చూస్తే.. మీరు మారతారనుకోవటం మా తప్పే అంటున్నారు ప్రజలు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు