తెరపైకి మళ్లీ శశికళ – అన్నాడీఎంకే పార్టీలో కీలక పరిణామాలు : ఎమ్మెల్యేలకు చిన్నమ్మ అభినందనలు

sasi kala wishes party mla's

తమిళనాడు కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న క్షణాల్లోనే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 150 స్థానాల్లో గెలిచి స్టాలిన్ సీఎం కాబోతున్న విషయం కంటే.. అన్నాడీఎంకే పార్టీలో జరుగుతున్న మార్పులు ఆసక్తి రేపుతున్నాయి.

తమిళనాడు ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా అన్నాడీఎంకే పార్టీ 80 సీట్లలో గెలుపొందింది. ఇది ఆ పార్టీనే ఆశ్చర్యానికి గురి చేసింది. జయలలిత లేని పార్టీ చిందర వందల అవుతుందని.. ఈ ఎన్నికలతో కనుమరుగు అవుతుందని అందరూ భావించారు. అయితే 80 సీట్లతో ప్రధాన, బలమైన ప్రతిపక్షంగా అవతరించింది అన్నాడీఎంకే పార్టీ. ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణతో ఆశ్చర్యపోయిన జయలలిత నెచ్చెలి.. శశకళ మళ్లీ తెరపైకి వచ్చారు.

అన్నాడీఎంకే తరపున గెలిచిన 80 మంది ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ ఫోన్లు చేసి వ్యక్తిగతంగా అభినందించారు. ఈ పరిణామాలతో షాక్ అయ్యారు పళనిస్వామి, పన్నీరు సెల్వం. అధికారంలో లేని పార్టీని నడిపించాలంటే అధినేతపై భయం అయినా ఉండాలి లేక పార్టీని ఆర్థికంగా నడిపించే సత్తా అయినా ఉండాలి లేక వ్యూహాలు రచించటంలో దిట్ట అయినా ఉండాలి.

అన్నాడీఎంకే ప్రస్తుత చీఫ్ గా ఉన్న మాజీ సీఎం పళనిస్వామి సౌమ్యుడు.. ఇక పన్నీరుసెల్వం సంగతి సరేసరి.. వీళ్లద్దరినీ నమ్ముకుని ఎమ్మెల్యేలు ఉండే పరిస్థితి లేదు.. వాళ్లను కంట్రోల్ చేసే సత్తా వీరికి లేదు. ఈ విషయాన్ని బాగా పసిగట్టిన శశికళ.. వెంటనే యాక్షన్ లోకి దిగిపోయారు. పార్టీపై పట్టు సాధించేందుకు మళ్లీ పాములు కదుపుతున్నారు.

జయలలిత ఉన్నప్పుడే చిన్నమ్మగా పాపులారిటీ సంపాదించి.. పార్టీని తెర వెనక ఉండి నడిపించారు శశికళ.. సీఎం సీటు ఒక్క రాత్రిలో దూరం అయ్యింది. అప్పుడున్న పరిస్థితులు వేరు.. ఇప్పుడున్న సిట్యువేషన్ వేరు.. దీన్ని అవకాశంగా మార్చుకుని మళ్లీ పార్టీని తన చెప్పుచేతల్లోకి తీసుకోవాలనే వ్యూహంతో రంగంలోకి దిగిపోయారు చిన్నమ్మ శశికళ.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు