అనాధలు అవుతున్న చిన్న పిల్లలు.. చదువుతుంటేనే కన్నీళ్లు వచ్చేస్తున్నాయి..

kids becomes orphans in india

దేశంలో కరోనాతో రోజువారీగా 3 వేల 500 నుంచి 4 వేల మంది అధికారికంగా చనిపోతున్నారు.. వాస్తవం అందుకు చాలా ఎక్కువగా ఉంటుందని పరిస్థితులు చెబుతున్నారు. ఈ సారి కుటుంబాలకు కుటుంబాలకు కరోనాతో చనిపోవటం చాలా ప్రాంతాల్లో జరిగింది. ఈ క్రమంలోనే పిల్లలు అనాథలుగా మారిపోతున్నారు. దేశంలో ఇది అతిపెద్ద సమస్యకు దారి తీస్తోంది.

ఏడాది వయస్సు ఉన్న చిన్నారి. కరోనాతో అమ్మ, నాన్నను కోల్పోయింది. నాన్న తరపు నానమ్మ, తాతయ్య దగ్గర ఉంది. ఆ చిన్నారి తల్లిదండ్రులు చనిపోయిన 10 రోజులకు నానమ్మ, తాతయ్యలకు కరోనా వచ్చింది. ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ జరిగే సమయంలో చుట్టుపక్కల వాళ్లు ఆ చిన్నారి తమ సంరక్షణలో చూసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి నాన్నమ్మ, తాతయ్య చనిపోయారు. ఆ చిన్నారి అనాధ అయ్యింది. అప్పటి వరకు చూసుకున్న చుట్టుపక్కల వారు.. ఆ చిన్నారిని ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్లిపోయారు. ఆ కుటుంబం మొత్తం 20 రోజుల వ్యవధిలో చనిపోయింది. ఇప్పుడు ఆ చిన్నారిని ఎవరు చూసుకుంటారు అనేది అతిపెద్ద సమస్య. చిన్నారి తల్లి తరపున వారిని పిలిచి మాట్లాడితే.. మా ఆర్థిక స్థోమత లేదు అంటూ తీసుకెళ్లటానికి నిరాకరించారు. పోలీసులు జోక్యం చేసుకుని.. డాక్టర్లు కౌన్సెలింగ్ ఇవ్వటంతో.. చివరికి ఆ చిన్నారిని తీసుకెళ్లారు. ఇప్పుడే వద్దు అన్నవారు.. భవిష్యత్ లో ఆ చిన్నారిని ఎలా చూస్తారు.. ఎలా పెంచుతారు అనేది పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు..

మరో కేసు చూస్తే.. కరోనాలో ఆ ఇంట్లో భర్త, అత్త, మామ 10 రోజుల వ్యవధిలో చనిపోయారు. మిగిలింది మూడేళ్ల బాబు, ఆ తల్లి మాత్రమే. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఫ్యామిలీ.. 10 రోజుల్లో నడిరోడ్డుపైకి వచ్చింది. కరోనా ఉందని బంధువులు, చుట్టాలు సైతం ఆదరించలేదు. ఇంటికి తీసుకెళ్లటానికి ఒప్పుకోవటం లేదు. ఇప్పుడు మూడేళ్ల కుమారుడితో.. ఆ తల్లి ఎలా బతకాలి.. ఎలా జీవించాలి అనేది పెద్ద సమస్యగా మారింది.

ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ స్లమ్ ఏరియా.. రెండు నెలల్లో 50 మంది చిన్నారులు అనాధలు అయ్యారు. తల్లిదండ్రులు కరోనాతో చనిపోవటంతో వాళ్లకు దిక్కులేకుండా పోయింది. అందరూ పదేళ్లలోపు చిన్నారులే. వారి ఆలనాపాలనా ఎవరూ పట్టించుకోకపోవటంతో స్థానికంగా ఉండే ఎన్జీవో సంస్థ చేపట్టింది. 50 మంది చిన్నారులను చేరదీసింది. రోజురోజుకు ఇలాంటి చిన్నారుల సంఖ్య పెరుగుతుందని.. NGO ఆధ్వర్యంలో వీళ్లందరి సంరక్షణ కష్టం అవుతుందని.. ఇలాంటి పిల్లలను దత్తత ఇవ్వటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చొరవ తీసుకోవాలని లేకపోతే భవిష్యత్ లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని.. వెంటనే దీని కోసం ప్రణాళిక రచించి అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని డిమాండ్ చేస్తోంది ఎన్జీవో సంస్థ.

ఒకటి కాదు.. రెండు కాదు దేశంలో ఇప్పుడు ఇలాంటి కేసులు వేలల్లో వస్తున్నాయి. పదేళ్లలోపు చిన్నారుల దత్తత ప్రక్రియ విషయంలో కొన్ని వెసలుబాట్లు కల్పించటంతోపాటు.. వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేయటానికి అధికారులు ముందుకు వస్తేనే.. సమస్యకు కొంత అయినా పరిష్కారం లభిస్తుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు