తమిళనాడు సీఎం స్టాలిన్ సొంతూరు ఒంగోలు.. ఇప్పటికీ భూములు ఉన్నాయి..

tamilnadu cm stallin home town ongole

తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన కరుణానిధి కుమారుడు స్టాలిన్ సొంతూరు ఏంటో తెలుసా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా. ఒంగోలు పట్టణానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని పెళ్లూరు, చెరువుకొమ్ముపాలెం గ్రామాల్లో కరుణానిధి తాత నివాసం ఉండేవారు. డీఎంకే అధినేత, మాజీ సీఎం కరుణానిధి ముత్తాత.. వెంకటగిరి రాజు ఆస్థానంలో విద్వాంసులుగా ఉండేవారు. నాయిబ్రాహ్మణ వర్గానికి చెందిన కరుణానిధి ముత్తాతకు.. అప్పటి వెంకటగిరి రాజు.. వందల ఎకరాల భూమిని దారాదత్తం చేసినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.

ఒంగోలు మండలం పరిధిలోని చెరువుకొమ్ముపాలెంలో 150 ఎకరాల భూమితోపాటు.. పెళ్లూరు చెరువు కింద 20 ఎకరాల భూమిని అప్పట్లోనే కరుణానిధి ముత్తాతకు ఇచ్చారు వెంకటగిరి రాజు. కాలక్రమంలో కరువు కాటకాలు రావటంతో ఉపాధి లేక జీవనాధారం గగనం అయిన క్రమంలో.. కరుణానిధి తాత చెన్నై వలస వెళ్లారు.

అప్పటి నుంచి ఆ భూములను ఎవరూ పట్టించుకోలేదు. అనంతరం బ్రిటీష్ పరిపాలనలో.. కరుణానిధి కుటుంబానికి చెందిన కొన్ని భూములను పేదలకు పంపచటం జరిగింది. కరుణానిధి తండ్రి స్వాతంత్య్రం ముందు.. కొన్నిసార్లు వచ్చి భూములను చూసుకుని వెళ్లేవారని.. కరుణానిధి హయాం నుంచి ఎవరూ రావటం లేదని చెబుతారు స్థానికులు.

కరుణానిధి సినిమాల్లోకి వచ్చిన తర్వాత.. ఒక సినిమా ఫంక్షన్ కోసం ఏపీలోని ఏలూరుకు వచ్చిన సందర్భంలో.. మాది ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని చెరువుకొమ్ముపాలెం, పెళ్లూరులో మా పూర్వీకులు ఉన్నారని.. ఇక్కడే మా తాత పుట్టారని చెప్పారు కూడా. తన తండ్రి హయం నుంచి ఏపీతో సంబంధాలు తెగిపోయాయని స్వయంగా వివరించారు.

ఏపీకి కరుణానిధి కొన్ని సందర్భాల్లో వచ్చినా.. ఇప్పటి సీఎం స్టాలిన్ మాత్రం అస్సలు రాలేదు. అసలు తన పూర్వీకులు ఏపీలోని వారనే సంగతి స్టాలిన్ పూర్తిగా విస్మరించారు. రాజకీయంగా ఎదుగుతున్న సమయంలో.. గత చరిత్రను ప్రస్తావించటం అనేది ఇబ్బందితో కూడుకున్నది.. దీంతోనే వాళ్లు అసలు ఏపీతో సంబంధాలు, భూముల విషయాన్ని పూర్తిగా వదిలేశారని చెబుతుంటారు. ఇక స్టాలిన్ వదిలేశారు అంటే.. అతని వారసులు ఎలా పట్టించుకుంటారు…

తమిళనాడు సీఎంగా స్టాలిన్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత.. ఒంగోలు పట్టణ సమీపంలోని చెరువుకొమ్ముపాలెం, పెళ్లూరు గ్రామాల్లో ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశం అయ్యింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు