కేరళలో ఈ ఒక్క సీటులో గెలుపుపై అందరి చూపు – హై ప్రొఫైల్ నియోజకవర్గం

కేరళలో ఈ ఒక్క సీటులో గెలుపుపై అందరి చూపు
  • కేరళలో ఈ ఒక్క సీటులో గెలుపుపై అందరి చూపు
  • హై ప్రొఫైల్ నియోజకవర్గంగా కేరళ రాష్ట్ర త్రిశూర్ నియోజకవర్గం
  • బరిలో నిలిచిన ముగ్గురే హై ప్రొఫైల్ ఉన్న వారే

కేరళ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. 2021, ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్ జరగనుంది. అన్ని నియోజకవర్గాలు ఎలా ఉన్నా.. ఒకే ఒక్క నియోజకవర్గం మాత్రం అందరి దృష్టికి ఆకర్షిస్తుంది. కేరళ రాష్ట్రంలోనే హై ప్రొఫైల్ నియోజకవర్గంగా దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతుంది. దీనికి కారణం లేకపోలేదు.

కేరళ రాష్ట్ర త్రిశూర్ నియోజకవర్గంలో గెలుపెవరిది అనేది ఇప్పుడు అందర్నీ నోట్ల హాట్ టాపిక్ అయ్యింది. ఇక్కడ నుంచి ముగ్గురు ఉద్దండులు పోటీ చేస్తున్నారు. బీజేపీ తరపున సినీ హీరో సురేష్ గోపీ బరిలోకి దిగితే.. ప్రధాన ప్రతిపక్షం, కాంగ్రెస్ మద్దతుదారుగా ఉన్న యూడీఎఫ్ నుంచి మాజీ సీఎం కరుణాకర్ కుమార్తె పద్మజ వేణుగోపాల్ పోటీ చేస్తున్నారు. ఇక అధికార పార్టీ సీపీఐకి చెందిన లెఫ్ట్ డెమొక్రటిక్ కూటమి నుంచి బాలచంద్రన్ బరిలో నిలిచారు. ఈ ముగ్గురూ ముగ్గురే.. ముగ్గురికీ రాజకీయ చరిత్రతోపాటు గత ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉంది.

త్రిశూర్ లోక్ సభ నుంచి 2019లో బీజేపీ తరపున ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన హీరో సురేష్ గోపీ 2 లక్షల 93 వేల 822 ఓట్లు సాధించారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ రెండేళ్లుగా అతను నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చారు. ఈసారి పార్టీ ఆదేశంతో ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో ఓటమి సానుభూతితోపాటు ప్రజలకు అందుబాటులో ఉన్నారనే టాక్ ఉండటంతో గెలుపుపై ధీమాగా ఉన్నారు సురేష్ గోపి.

ఇక ప్రతిపక్షం యూడీఎఫ్ నుంచి బరిలోకి దిగిన మాజీ సీఎం కుమార్తె పద్మజ సైతం గెలుపుపై ధీమాగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కేవలం 6 వేల 987 ఓట్లతో ఓడిపోయారు. ఈసారి మరింత పట్టుదలగా జనంలో తిరుగుతున్నారు. త్రిశూర్ నియోజకవర్గం అనేది కాంగ్రెస్ కంచుకోటగా చెబుతారు. 1991 నుంచి 2011 వరకు కాంగ్రెస్ అభ్యర్థి మాత్రమే గెలుస్తూ వచ్చారు. 2016 ఎన్నికల్లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పద్మజ ఓడిపోయారు. ఈసారి మాత్రం మళ్లీ గెలుస్తాననే ధీమాతో ఉన్నారు.

మూడో అభ్యర్థి అధికార పార్టీ తరపున దిగిన బాలచంద్రన్. కరుడుగట్టిన సీపీఐ పార్టీ కార్యకర్త. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో త్రిశూర్ పక్కనే ఉన్న తెరంబిల్ నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు. జిల్లా యూత్ లీడర్ గా అందరికీ సుపరిచితుడు అయిన బాలచంద్రన్.. ఈసారి త్రిశూర్ నుంచి బరిలోకి దిగటం ఆసక్తి రేపుతుంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి అయిన సునీల్ కుమార్ ను తప్పించి మరీ ఈ సీటును బాలచంద్రన్ కు కేటాయించింది అధికార పార్టీ సీపీఐ. యువతలో బాలచంద్రన్ కు ఉన్న మైలేజ్ తో గెలుపు ఖాయం అంటోంది.

కేరళ రాష్ట్రంలోనే హై ప్రొఫైల్ నియోజకవర్గంగా త్రిశూర్ ఉంది. ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న వాళ్లు అందరూ సామాన్యులు కాదు.. ఓడితే ఓర్చుకునే రకాలు కాదు.. అందరూ ఇగో పర్సన్స్.. డబ్బుకు డబ్బు.. పలుకుబడికి పలుకుబడి ఉన్న నేతలు.. అటు పార్టీలోనూ.. ఇటు జనంలోనూ ముగ్గురూ ముగ్గురే.. అందుకే కేరళ రాష్ట్రం మొత్తం ఇప్పుడు త్రిశూర్ లో గెలిచేది ఎవరూ అని ఆసక్తిగా చూస్తోంది.

See also : రెండు రోజుల్లో మాస్క్ జరిమానా రూ.17 లక్షలు – హైదరాబాదీలు బీ అలర్ట్

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు