బతకాలో చావాలో డెసిషన్ మీదే : హైదరాబాద్ లో కరోనా బెడ్స్ లేవు : ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోజుకు లక్ష

corona virus effect in telangana hyderabad

హైదరాబాద్ లో కరోనా మనకు తెలియని విధంగా.. చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రభుత్వం చూపిస్తున్న లెక్కల కంటే.. కొన్ని రెట్లు అధికంగా జనంలో కరోనా ఉంది. లక్షణాలు బయటపడకుండా.. శరీరం అంతా వైరస్ వ్యాపించిన తర్వాతే బయటపడుతుంది. దీంతో కరోనా అని నిర్థారణ అయిన వెంటనే.. ఆస్పత్రిపాలు అవుతున్నారు బాధితులు.

కరోనా బాధితులకు హైదరాబాద్ లో బెడ్స్ దొరకటం లేదు. అన్ని ఆస్పత్రుల్లో ఫుల్ అని వస్తోంది. కరోనా బెడ్స్ లేవు అనే సమాచారం వస్తోంది. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు అయితే అంది వచ్చిన అవకాశాన్ని దోపిడీగా మార్చుకుంటున్నాయి. రోజుకు లక్ష రూపాయలు ఇస్తేనే బెడ్ అంటున్నాయి. దీంతో మధ్యతరగతి, సామాన్యుల పరిస్థితి దయనీయంగా ఉంది. కరోనా పరీక్షలు ఎక్కడ చేస్తున్నారు.. ఎక్కడ ట్రీట్ మెంట్ జరుగుతుంది.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్స్ ఉన్నాయా లేవా అనే విషయాలు చాలా మందికి తెలియటం లేదు.

కరోనా బారిన పడిన ఓ యువకుడు.. రెండు రోజులపాటు హైదరాబాద్ అంతా తిరిగినా బెడ్ దొరకలేదు.. దీంతో సిటీ శివార్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రోజుకు 40 వేల రూపాయలు చెల్లించి బెడ్ తీసుకున్నాడు. మూడో రోజుకు కొంచెం కోలుకున్నాడు. ఇది ఓ యువకుడి పరిస్థితి మాత్రమే కాదు.. చాలా మంది దుస్థితి ఇది.

ఇటీవల జమ్మూకాశ్మీర్ టూర్ వెళ్లి వచ్చిన ఓ కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. పది మంది టూర్ వెళ్లిరాగా.. వారిలో ఎనిమిది మంది కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు.

చాలా మంది ప్రైవేట్ ఆస్పత్రుల్లో ల్యాబ్స్ లో పరీక్షలు చేయించుకుని.. ప్రైవేట్ గా చికిత్స పొందుతున్నారు. ఇవన్నీ ప్రభుత్వ లెక్కల్లోకి రావటం లేదనేది బాధితుల నుంచి వస్తున్న సమాచారం.

లాక్ డౌన్ లేదు.. కరోనా నుంచి ఎవరికి వారు రక్షణ పొందాల్సిందే. మొదటిసారి కరోనా కంటే.. వంద రెట్లు అధికంగా ఇప్పుడు వ్యాప్తి జరుగుతుంది. దీనికి సాక్ష్యం ఏంటంటే.. ఏప్రిల్ 14వ తేదీ ఒక్క రోజే దేశంలో రెండు లక్షల కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఏప్రిల్ 15వ తేదీ ఏపీలో 5 వేలు.. తెలంగాణలో 4 వేల కరోనా కేసులు నమోదయ్యాయి.

వచ్చే ఆరు వారాలు.. అంటే మే నెలాఖరు వరకు కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని.. కేసులు పెరిగి.. బెడ్స్ దొరకని దుస్థితి వస్తుందని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. కానీ ఆ పరిస్థితి ఇప్పుడే వచ్చేసింది.

ప్రభుత్వాలు చేతులెత్తేశాయి.. ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటూ.. సెల్ఫ్ లాక్ డౌన్ అవుతూ.. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.. బీ అలర్ట్.. బెడ్స్ లేవు.. డబ్బులు ఉన్నా కరోనాతో బతికి బట్టకడతామా లేదా అనేది చెప్పలేని దుస్థితిలోకి వెళ్లిపోయింది సమాజం..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు