చందానగర్ లో ఎన్టీఆర్ సోదరి ప్రచారం – జనంలో అనూహ్య స్పందన

చందానగర్ లో ఎన్టీఆర్ సోదరి ప్రచారం - జనంలో అనూహ్య స్పందన.. అభ్యర్థి జెల్లా మౌనిక కు ఓటు వేసి కార్పొరేటర్ గా గెలిపించాలని దీప్తి శ్రీనగర్ లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.

ఎవరు అయితే దిగకూడదో వాళ్లే దిగితే పరిస్థితులు, పరిణామాలు ఎలా మారిపోతాయో.. జనంలో కదలిక ఎలా వస్తుందో చూపిస్తున్న డివిజన్ చందానగర్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా.. కొన్ని డివిజన్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరీ ప్రచారం చేస్తున్నది తెలుగుదేశం పార్టీ. 150 కాదు.. ఓ 10 డివిజన్లలో గెలుద్దాం అని వ్యూహాత్మక ఎత్తుగడతో ముందుకు సాగుతోంది టీడీపీ.

టీడీపీ గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్న డివిజన్లలో చందానగర్ మొదటి ప్లేస్ లో ఉంది. దీన్ని గుర్తించిన అధిష్టానం.. అభ్యర్థులకు మద్దతుగా కీలక నేతలను రంగంలోకి దించింది. నందమూరి హరికృష్ణ కుమార్తె, జూనియర్ ఎన్టీఆర్ సోదరి అయిన నందమూరి సుహాసిని డివిజన్ లోని దీప్తి శ్రీగర్, చందానగర్ ప్రాంతాల్లో పర్యటించారు. ఊహించిన దానికంటే అనూహ్యమైన మద్దతు లభించటం విశేషం.

దీప్తిశ్రీనగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులతోపాటు స్థానిక ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ మద్దతు ప్రకటించారు. చందానగర్ డివిజన్ లోని పేదలను ఇంటింటికీ వెళ్లి కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా ఇంకా ఉంది.. జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పనులు దొరుకుతున్నాయా.. జీవితం సాఫీగా సాగుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కొందరు పేదలు తమ బాధలను సుహాసిని దృష్టికి తీసుకురాగా.. నిర్మాణ్ ఫౌండేషన్ తర్వాత సాయం అందుతుందని హామీ ఇచ్చారు. ఓట్లు – సీట్లు కోసం మాత్రమే కాదు.. ప్రజల కష్టసుఖాల్లోనూ టీడీపీ అండగా, తోడుగా ఉంటుంది అన్నారు నందమూరి సుహాసిని. చందానగర్ డివిజన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జెల్లా మౌనిక కు ఓటు వేసి కార్పొరేటర్ గా గెలిపించాలని దీప్తి శ్రీనగర్ లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.

చందానగర్ డివిజన్ లో టీడీపీకి గెలిచిన చరిత్ర ఉందని.. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించి పూర్వ వైభవం తీసుకొద్దాం అని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజల్లోకి వెళ్లండి.. ప్రజల బాధలు తెలుసుకోండి.. వారికి ఆసరా ఉండండి అని పిలుపునిచ్చారు.

వచ్చే ఎన్నికల్లో మీ మద్దతు టీడీపీ పార్టీకి.. మీ ఓటు టీడీపీకి వేయాలని ప్రజలను కోరారు. చందానగర్ డివిజన్ లో పార్టీకి వస్తున్న స్పందన చూస్తుంటే పార్టీ గెలుపు ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ సోదరిని, హరికృష్ణ కుమార్తెను చూడటానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు యువతీ యువకులు, పేదలు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు