అల్లు అర్జున్ సినిమా చూసి.. పెద్దపల్లిలో అతిపెద్ద బ్యాంక్ దోపిడీ

allu arjun movie type robbery in peddapalli

తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్‌లో మార్చి 24వ తేదీ రాత్రి భారీ దోపిడీ జరిగింది. బ్యాంక్ లోని 18 లక్షల 50 వేల నగదు, ఆరు కేజీల బంగారాన్ని ఎత్తుకెళ్లారు దోపిడీ దొంగలు. బంగారంతో కలిపి మొత్తం విలువ రూ.3 కోట్లపైన ఉంటుందని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు.

దొంగలు చాలా వ్యూహాత్మకంగా.. చాలా పద్దతిగా ఈ బ్యాంక్ దోపిడీ చేశారు. ఎలాంటి క్లూస్ వదిలి పెట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బ్యాంక్ లో ఎలాంటి సెక్యూరిటీ ఉంది అనేది ముందుగానే గుర్తించి మరీ రాబరీ చేసినట్లు చెబుతున్నారు పోలీసులు. బ్యాంక్ కిటికీకి ఉండే చువ్వలను కట్టర్ ద్వారా తొలగించిన బ్యాంక్ లోకి వచ్చిన దొంగలు.. ముందుగా సీసీ కెమెరాల వైర్లు కట్ చేశారు. ఆ తర్వాత అలారం సిస్టమ్ ఆఫ్ చేశారు. ఫైర్, కరెంట్ వైర్లు కట్ చేశారు. ఆ తర్వాత లాకర్ ను.. వెల్డింగ్ మెషీన్ తో కట్ చేసి.. అందులోని బంగారం, డబ్బు దోచుకున్న వెళ్లిపోయారు.

బ్యాంక్ దోపిడీ చూస్తుంటే.. అచ్చం అల్లు అర్జున్ తీసిన జులాయి సినిమాలోని బ్యాంక్ రాబరీలానే ఉందని బ్యాంక్ సిబ్బంది, అధికారులు చెబుతున్నారు. దోపిడీ జరిగిన తీరు చూసి పోలీసులు సైతం షాక్ అయ్యారు. చాలా పకడ్బందీగా జరిగిందని.. ఎలాంటి ఆధారాలు వదిలిపెట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారని.. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం.. సినిమాలు, యూట్యూబ్ చూసి మరీ ప్లాన్ వేసి.. వ్యూహం అమలు చేసినట్లు తెలుస్తుందని భావిస్తున్నారు.

దొంగలను పట్టుకునేందుకు ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు. బ్యాంక్‌లో దొంగతనం చేసిన దుండగులు ఎలాంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడ్డారని ఏకంగా కమిషనర్ చెప్పటం విశేషం. బ్యాంక్ వెనక ఉన్న కిటికీని చాలా జాగ్రత్తగా తొలగించి.. బ్యాంక్‌లోని అలారం మోగకుండా జాగ్రత్త పడ్డారని పోలీసులు గుర్తించారు. బ్యాంక్‌లోని స్ట్రాంగ్ రూంలోకి చొరబడి పగుల కొట్టడానికి వీలులేనటువంటి లాకర్‌ను గ్యాస్ కట్టర్‌తో కట్‌చేసి.. అందులోని ఆరు కేజీల బంగారం, రూ.18 లక్షల 46 వేల నగదును ఎత్తుకెళ్లారని.. ఆధారాలు లభించకపోయినా విచారణలో భాగంగా దోపిడీదారులను పట్టుకుంటామని చెబుతున్నారు పోలీసులు. బ్యాంక్ సెక్యూరిటీ వింగ్ సాయంతో.. రామగుండం కమీషనర్ ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకుని విచారణ చేస్తున్నారు.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు