హైదరాబాద్ మళ్లీ ఖాళీ అవుతుంది : రెండు రోజుల్లోనే 50 వేల మంది వెనక్కి – సొంతూళ్లకు జనం, వలస కార్మికులు

హైదరాబాద్ మళ్లీ ఖాళీ అవుతుంది - రెండు రోజుల్లోనే 50 వేల మంది వెనక్కి - సొంతూళ్లకు జనం, వలస కార్మికులు

హైదరాబాద్ లో పెరుగుతున్న కరోనా కేసులు.. ప్రధాని మోడీ రాత్రి పూట కర్ఫ్యూ ప్రకటనతో.. వలస కార్మికుల్లో హైరానా మొదలైంది. గతంలో ఉన్న అనుభవాల దృష్ట్యా ముందస్తున్న జాగ్రత్తలతో.. వలస కార్మికులు ఇంటి బాట పడుతున్నారు.

లాక్ డౌన్ లేదు అని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినా.. వలస కార్మికుల్లో భయం పోవటం లేదు. కరోనా కట్టడిపై ఆంక్షల దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్న క్రమంలో.. ముఖ్యంగా వలస కార్మికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో వెనక్కి వెళ్లిపోతున్నారు. రెండు రోజుల్లోనే హైదరాబాద్ నుంచి సరాసరి 50 వేల మంద కార్మికులు, స్టూడెంట్స్, ఆన్ లైన్ నుంచి పని చేస్తున్న ఉద్యోగులు వెనక్కి వెళ్లిపోయారు.

రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నారు. మహారాష్ట్ర వెళ్లే బస్సులు అన్నీ రద్దీగా ఉన్నాయి. ఏపీకి వెళ్లే వారి సంఖ్య సైతం భారీగానే ఉందని అంచనా వేస్తున్నారు.

ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి పనుల కోసం హైదరాబాద్ వచ్చిన భవన నిర్మాణ కార్మికులు, వలస కూలీలు వెనక్కి వెళ్లిపోతున్నారని ఆయా సంస్థలు చెబుతున్నాయి. మహారాష్ట్రం, యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఇప్పటికే కఠిన ఆంక్షలు, తాత్కాలిక లాక్ డౌన్, కర్ఫ్యూలు విధించారని.. అక్కడి కుటుంబ సభ్యులు ఫోన్లు చేసి పరిస్థితులు వివరించటంతో.. ఏ క్షణమైనా హైదరాబాద్ లోనూ లాక్ డౌన్ విధించొచ్చు అనే భయంతో.. కార్మికులు సొంత ఊరి బాట పడుతున్నారు.

దీనికితోడు వలస కార్మికులకు వ్యాక్సిన్ ఇచ్చే విషయంలో అటు ప్రభుత్వాలతోపాటు ఆయా కంపెనీలు, సంస్థలు పట్టించుకోవటం లేదు. వలస కార్మికుల భద్రత, ఆరోగ్యంపై ఏ మాత్రం దృష్టి పెట్టకపోవటంతో.. ఆందోళనకు గురవుతున్న కార్మికులు సొంతూరికి వెళ్లిపోయారు. రైళ్లు, బస్సుల్లో సీట్లు దొరకని వారు.. డీసీఎం వ్యాన్లు, లారీలు మాట్లాడుకుని.. 40, 50 మంది గుంపుగా వెళ్లిపోతున్నారు.

ఇదే విధంగా కొనసాగితే.. మరో వారం, 10 రోజుల్లో హైదరాబాద్ నుంచి కనీసం నాలుగు లక్షల మంది వలస కార్మికులు వెళ్లిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే.. ఆయా రంగాల్లో సిబ్బంది కొరత ఏర్పడుతుందని.. వ్యాపారాలు దెబ్బతింటాయని ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న వ్యవస్థలు మళ్లీ దెబ్బతినే అవకాశం ఉంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు