డబ్బులు ప్రైవేట్ ఆస్పత్రికి – దొబ్బులు ప్రభుత్వ ఆస్పత్రికి : మారాల్సింది ఎవరు జనం కదా- పేదోళ్లవి కాదు ప్రజల ఆస్పత్రులు

private hospitals in covid time

కొన్ని వాస్తవాలు, సత్యాలు చాలా కఠినంగా.. ఖటువుగా ఉంటాయి.. ఏ మీడియా చెప్పని.. చూపించిన.. మర్గున పడిన నిజాన్ని బయటకు తీస్తే ఎవరికీ సహించటం లేదు.. మార్పు కోసం వచ్చామని చెప్పుకునే మీడియా సైతం శవాలపై పైసలు వేరుకునే విధంగా తయారైనప్పుడు.. మారాల్సింది ఎవరు.. జనమే కదా.కరోనా టైంలో ఈ వాస్తవాన్ని చెబుతున్నాం. పాటిస్తే భవిష్యత్ లో బతుకుతారు.. లేదంటే రోడ్డుపై అనాథ శవంగా.. అబద్ధానికి బలైన వాడిగా చస్తారు.

కరోనా వచ్చిందని హడావిడి, హైరానా పడి ఆస్పత్రులకు పరిగెడుతున్నారు కదా, ఎంత మంది ప్రభుత్వ ఆస్పత్రికి వెళుతున్నారు అనేది ఆలోచిస్తున్నారా? చేతిలో డబ్బులు ఉంటే ప్రైవేట్ ఆస్పత్రికి పరుగులు పెడుతున్నారు.. అక్కడ డబ్బులన్నీ వదిలించుకున్న తర్వాత.. ఈ ప్రాణం ఇక బతకదు అని నిర్థారించుకున్న తర్వాత.. ప్రైవేట్ ఆస్పత్రులు చేతులెత్తేసి.. బెడ్ పై ఉన్న మిమ్మల్ని రోడ్డుపైన పడేస్తున్నాయి.

ఆ తర్వాత తీరిగ్గా ప్రభుత్వ ఆస్పత్రికి వస్తున్నారు. అప్పటికే చావు బతుకుల మధ్య ఉంటున్న వారు సర్కార్ ఆస్పత్రిలో తుది శ్వాస విడుతున్నారు. గతం అంతా క్షణాల్లో మర్చిపోతున్న రోగి బంధువులు.. ప్రభుత్వ ఆస్పత్రుల తీరును ఎండగడుతున్నారు, దాడులు చేస్తున్నారు. వారం, 10 రోజులు ట్రీట్ మెంట్ చేసి లక్షలకు లక్షలు వసూలు చేసిన ప్రైవేట్ ఆస్పత్రి అప్పటి వరకు మంచిగా కనిపించింది. కొన ఊపిరితో ఉన్న వారికి ఉచితంగా వైద్యం చేసిన ప్రభుత్వ ఆస్పత్రి దారుణంగా తయారైంది..

మొదటి నుంచి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇదే వైఖరి కొనసాగుతుంది. ఓ పథకం ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రులపై కొన్ని మీడియా సంస్థలు సైతం విషం చిమ్మారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ట్రీట్ మెంట్ అంటే ప్రైవేట్ ఆస్పత్రి అన్నట్లుగా జనం ఫీలయ్యిపోతున్నారు. ఆస్తులు అమ్మి ప్రైవేట్ ఆస్పత్రులకు ధారపోసి.. శావాలను తెచ్చుకుంటున్నారు.

అంత ఎందుకు నారాయణ, చైతన్య ఇంటర్ కాలేజీల్లో వందల మంది ఆత్మహత్య చేసుకుంటే.. రిజల్ట్ టైంకు వందల కోట్లు యాడ్స్ తీసుకునే మీడియా.. అవన్నీ సహజమే అన్నట్లు చిత్రీకరించేది. ఆ ఉసురు తగిలే కదా.. నారాయణ కొడుకు అలా పోయాడని జనం ఆడిపోసుకోలేదా ఏంటీ..

విశాఖపట్నంలోని ఏడాది చిన్నారి అంబులెన్స్ లో చనిపోయిన విషయం చాలా బాధాకరం.. ఎవరూ సమర్ధించరు.. కానీ వారం రోజులపాటు రెండు ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగిన ట్రీట్ మెంట్ ఏంటీ? మా వల్ల కాదు అన్నప్పుడే కదా.. చివరికి ఏ ప్రైవేట్ ఆస్పత్రి జాయిన్ చేసుకోనప్పుడే కదా.. డబ్బులు అన్నీ అయిపోయిన తర్వాతే కదా.. ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చింది. ఈ మాటలు అన్నది ఆ తల్లి దండ్రులే.. ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రిపై ఆడిపోసుకుంటే ఏం లాభం. మీడియా సైతం ఆ రెండు ప్రైవేట్ ఆస్పత్రుల్లో వారం రోజుల ట్రీట్ మెంట్ ను పక్కనపెట్టి.. జీజీహెచ్ నిర్లక్ష్యం అంటూ ఆడిపోసుకుంటున్నారే.. ఎంత వరకు సబబో ఆత్మ విమర్శ చేసుకోవాలి.

ఇప్పటికైనా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది కొరతపై ప్రశ్నిద్దాం.. వసతులపై ఉద్యమిద్దాం.. ట్రీట్ మెంట్ పై గళమెత్తుదాం.. జనం కట్టే పన్నులతో జీతాలు, వసతులు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం.. ఊరికే కాదు కదా.. మన సొమ్ముతో నడుస్తున్న ఆస్పత్రులను వదిలేసి.. ఆస్తులు అమ్మి ప్రైవేట్ ఆస్పత్రులను పోషించి.. చివరి శవాలను తీసుకొచ్చుకొనే దుస్థితి ఎవరికీ వద్దు.

ప్రభుత్వ ఆస్పత్రి అంటే అందరిదీ.. పేదోళ్లది కాదు.. ప్రజలది అని గుర్తు పెట్టుకోండి.. ఇలాంటి కరోనా సంక్షోభంలోనూ ఖర్చు లేకుండా వైద్యం చేస్తుంది ప్రభుత్వ ఆస్పత్రులే.. గుర్తుపెట్టుకోండి. కర్నూలు, విశాఖ, గుంటూరు, హైదరాబాద్ ఇలా ఎన్నో చోట్ల ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు వేలాది మంది రోగులకు ఉచితంగా వైద్యం చేసి జాగ్రత్తగా ఇంటికి పంపిస్తున్నాయి అనే విషయం మర్చిపోకండి.

Note : ఇందులో న్యాయం ఉంది అనిపిస్తే మీ అభిప్రాయం చెప్పి సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరికి తెలియజేయండి

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు