తెలంగాణ బీజేపీలో గుసగుసలు తక్కువేం లేవు, బయటకు కనిపించటం లేదుకానీ..

bandi sanjay vs kishan reddy

నువ్వు బీజేపీ కార్యకర్తవా.. నేతవా అని అడగటం లేదు.. నీది ఏ వర్గం అని అడుగుతున్నాం.. ఇదీ తెలంగాణ బీజేపీకి చెందిన ఓ వ్యక్తి నుంచి వచ్చిన మాట. నవ్వుతూ.. సరదాకి ఆ వ్యక్తి అలా అన్నప్పటికి,  బీజేపీలోని వర్గపోరుకు ఇది నిదర్శనంగా మారింది. బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత.. కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి మధ్య గ్యాప్ పెరిగిందనే టాక్ చాలా కాలంగా ఉన్నా.. ఇటీవల ఈటెల రాజేందర్ రాకతో మరోసారి భగ్గుమన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

బండి సంజయ్ – కిషన్ రెడ్డి మధ్య రాజకీయ పోరుతోపాటు వీళ్లద్దరిని సపోర్ట్ చేసే పత్రికలు, న్యూస్ ఛానళ్లు సైతం రెండూగా చీలిపోయాయనే టాక్ బలంగా వినిపిస్తుంది. బండి సంజయ్ ను వీ6, రాజ్ న్యూస్ లాంటి ఛానళ్లు నెత్తికెత్తుకుంటే.. టీవీ9, 10 టీవీ, టీ న్యూస్ మాత్రం కిషన్ రెడ్డిని ఆకాశానికెత్తుతున్నాయి. ఇక ఈటెల రాజేందర్ చేరిక విషయంలో ఎంపీ, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నీ తానై వ్యవహరించారు. ఈటెలతో చర్చించటం దగ్గర నుంచి అధిష్టానంతో మాట్లాడే వరకు.. ఈటెల పార్టీ చేరిక నుంచి నియోజకవర్గంలో ర్యాలీ వరకు బండి సంజయ్ మొత్తం తన భుజానికెత్తుకున్నారు. ఈటెల వ్యవహారంలో మాత్రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటీముట్టనట్లుగానే ఉన్నారని పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్న మాట.

బండి సంజయ్ కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించిన తర్వాత.. హైదరాబాద్, రంగారెడ్డి కేంద్రంగా ఉన్న బీజేపీ నేతలు కిషన్ రెడ్డికి దగ్గరయితే.. మిగతా తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు బండి సంజయ్ కు సలాం కొట్టారు. రాష్ట్రవ్యాప్త పాపులారిటీలో బండి సంజయ్ దూసుకు వెళ్లటం.. ఆయనకు ఉన్న సహజమైన దూకుడు, మాటకారి వ్యవహారం బండికి కలిసివస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నా కూడా కిషన్ రెడ్డి రాణించలేకపోతున్నారనే చర్చ పార్టీలో ఉంది. దీనికి కారణం ఆయన సౌమ్యుడు కావటమే.

ఇద్దరు నేతలు పార్టీలో పట్టు, బలం, పాపులారిటీ కోసం తమ వంతు ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తుండగా.. నేతలు, కార్యకర్తలు మాత్రం నలిగిపోతున్నారు. ముఖ్యంగా నేతలు అయితే కరవమంటే కప్పకు.. విడవమంటే పాముకు కోపం అన్నట్లు తయారైంది. ఎవరికి మద్దతు తెలిపితే ఎవరికి కోపం వస్తుందో అనే ఆందోళన నెలకొంది. ఈటెల రాజేందర్ రాక తర్వాత.. నేతలు అయితే గుంబనంగా చర్చించుకుంటున్నారంట.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు