రఘువీరారెడ్డితో బీజేపీ నేతల మంతనాలు.. పార్టీలోకి రావాలని ఆహ్వానం..

raghu veera reddy in touch with bjp leaders

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రఘువీరారెడ్డిపై ఇప్పుడు ఏపీ బీజేపీ చూపు పడింది. నిన్నటి వరకు ఆయన ఉన్నారన్న సంగతినే మర్చిపోయిన బీజేపీ నేతలు..ఇప్పుడు ఆయన కోసం ఆరాటంగా ఎదురుచూస్తున్నారు. దీనికి కారణంగా ఆయన మళ్లీ వెలుగులోకి రావటమే.

రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ మట్టికొట్టుకుపోవటంతో.. ఏ పార్టీలోకి వెళ్లటానికి ఇష్టపడని రఘువీరారెడ్డి తన సొంత ఊరు వెళ్లిపోయారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం మడకశిరలో సొంతంగా వ్యవసాయం చేసుకుంటూ హాయిగా జీవిస్తున్నారు. ఇటీవలే వెయ్యేళ్ల నాటి ఆలయాలను పున:రుద్దరించి తన దైవ భక్తిని చాటుకున్నారు. శిథిలమైన ఆలయ క్షేత్రాన్ని ప్రజల భాగస్వామ్యంతో.. ప్రజల విరాళాలతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం అభినందనలు వ్యక్తం చేశారు.

రఘువీరారెడ్డి వ్యక్తిత్తంతోపాటు ప్రజల్లో ఆయనకు ఉన్న పలుకుబడిని గుర్తించిన ఏపీ బీజేపీ నేతలు.. మళ్లీ రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. రాయలసీమ ప్రాంతం నుంచి బలమైన నేతను వెతుకుతున్న బీజేపీకి.. బీసీ సామాజిక వర్గం నుంచి.. అందులోనూ మాజీ మంత్రి.. నిజాయితీ రాజకీయ నేతగా గుర్తింపు ఉన్న రఘువీరారెడ్డి వరంగా మారారు.

ప్రస్తుత రాజకీయ పరిణామాల క్రమంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల్లోకి వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే వెళ్లాలనుకుంటే 2014లోనే ఈ రెండు పార్టీలు ఆహ్వానించాయి. అప్పుడే కాదన్నవారు.. ఇప్పుడు ఎలా వెళతారు అనుకున్న బీజేపీ.. పార్టీలోకి ఆహ్వానించింది.

బీజేపీ ఆహ్వానంపై ఎటూ తేల్చుకోలేదు రఘువీరారెడ్డి. రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదని.. హాయిగా వ్యవసాయ పనులు చేసుకుంటూ.. ఆధ్యాత్మిక చింతలో హ్యాపీగా ఉన్నానని చెప్పారంట. అయినా పట్టువదలకుండా రఘువీరారెడ్డి వెంట పడుతున్నారంట. కొన్ని రోజులకు అయినా అతని మనసు మారి.. బీజేపీలోకి వెళతారో లేదో చూడాలి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు