గ్రామాల్లోకి వచ్చిన సముద్రం నీళ్లు – సునామీ భయంతో పరుగులు

గ్రామాల్లోకి వచ్చిన సముద్రం నీళ్లు – సునామీ భయంతో పరుగులు

గ్రామాల్లోకి సముద్రం నీళ్లు రావటం అంటే మాటలు కాదు.. ఎంతో పోటు ఉంటేనే అలా జరుగుతుంది. నెల్లూరు జిల్లా పల్లెపాలెం గంగపట్నం గ్రామంలోకి సముద్రపు నీళ్లు పోటెత్తాయి. గ్రామంలోని రోడ్లపై ప్రవహిస్తున్నాయి. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు భయంతో పరుగులు తీశారు. సునామీ వచ్చింది అనే మాటలతో ఇళ్లు వదిలి పారిపోయారు పల్లెపాలెం, గంగపట్నం గ్రామాల ప్రజలు.
నెల్లూరు జిల్లాలో ఐదు రోజులుగా వర్షం పడుతుంది.

కుండపోత వానలతో వాగులు, నదులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. దీనికితోడు ఇప్పుడు సముద్రం నీళ్లు గ్రామాల్లోకి పోటెత్తుతుండటంతో భయపడిపోతున్నారు జనం. పైన వర్షం.. కింద సముద్రం నీళ్లు.. ఇంకో వైపు సముద్రపు అలల తాకిడి, హోరు శబ్దాలతో బీభత్సంగా ఉంది వాతావరణం అంటున్నారు ఆయా మత్స్యగ్రామాల ప్రజలు. అమావాస్య, పౌర్ణమికి సముద్రపు పోటు ఉండటం సహజం..

ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా సముద్రం నీళ్లు గ్రామాల్లోకి రాలేదని.. ఇప్పుడు రావటం దేనికి సంకేతం అంటున్నారు జనం. పోటు ఈ స్థాయిలో ఉండటంపై సునామీ హెచ్చరికలు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. సునామీ హెచ్చరికలు ఏమీ లేవని.. ఈసారి పోటు కొంచెం ఎక్కువగా ఉందని.. వాతావరణంలో మార్పుల వల్ల ఇలా జరిగింది అని చెబుతున్నారు అధికారులు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు