జగన్ కు సవాల్ గా శ్రీకాకుళం మంత్రి వర్గ విస్తరణ.. అందరూ నమ్మిన బంట్లే..

జగన్ కు సవాల్ గా శ్రీకాకుళం మంత్రి వర్గ విస్తరణ.. అందరూ నమ్మిన బంట్లే..

జగన్ కు సవాల్ గా శ్రీకాకుళం మంత్రి వర్గ విస్తరణ.. అందరూ నమ్మిన బంట్లే..

శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. రాబోయే మంత్రి వర్గ విస్తరణలో.. ఈసారి మంత్రి పదవి గ్యారెంటీ అంటూ కొందరు ఎమ్మెల్యేలు ప్రచారం చేసుకోవటం విశేషం.

ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా నుంచి స్పీకర్ గా తమ్మినేని సీతారాం, కేబినెట్ మంత్రులుగా ధర్మాన కృష్ణదాస్, సిదిరి అప్పలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో పలాస నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అప్పలరాజు.. కరోనా సమయంలో ఏడాది క్రితమే మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక తమ్మినేని సీతారాం స్పీకర్ గా కొనసాగుతున్నారు. వీళ్లిద్దరినీ కదిలించకపోవచ్చనే ప్రచారం ఉంది. స్పీకర్ హోదాలో.. తమ్మినేని బాగానే రాణిస్తున్నారు. కొత్తగా మంత్రి అయిన అప్పలరాజు కాలం ఏడాది మాత్రం. ఇక మిగిలింది ధర్మాన కృష్ణదాస్. ఇతను జిల్లాలో చక్రం తిప్పుతున్న లీడర్. ఆర్థికంగా, కుల సామాజికంగా బలంగా ఉన్న లీడర్. అతన్ని కదిలిస్తారా అనే చర్చ మరో వైపు ఉంది.

ఇక శ్రీకాకుళం జిల్లా నుంచి మంత్రి పదవులు ఆశిస్తున్న వారి లిస్ట్ లో ప్రధమంగా వినిపిస్తుంది ధర్మాన ప్రసాదరావు. మాజీ మంత్రి కూడానూ. ప్రస్తుతం ఇతని తప్పుడే ధర్మాన కృష్ణదాస్ మంత్రిగా ఉన్నారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి ఇవ్వటం సాధ్యం పడదు.. తమ్ముడిని తప్పించి.. అన్నకు ఇస్తారో లేదో చూడాలి. కష్టమే అనే భావన ఉంది.

ఇక టాప్ ప్లేస్ లో వినిపిస్తున్న పేరు రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఇతన్ని ప్రలోభపెట్టినా పార్టీ మారలేదు. ఎస్సీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం. సీనియర్ లీడర్. జగన్ ను బాగా నమ్ముకున్నాడు. మొదటి విడతలోనే ఆశించినా పదవి దక్కలేదు. ఈసారి గ్యారెంటీగా మంత్రిని అవుతా అంటున్నారు కంబాల జోగులు.

మరో మహిళా ఎమ్మెల్యే సైతం మంత్రి పదవి ఆశిస్తున్నారు. పాలకొండ నుంచి రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యే కళావతి. చంద్రబాబు మంత్రి పదవి ఇస్తానన్నా వెళ్లలేదని.. జగన్ నే నమ్ముకుని ఉన్నానని చెబుతున్నారు. ఎస్టీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సామాజిక కోటా కింద పదవి దక్కుతుందని భావిస్తున్నారు.

మంత్రి వర్గ విస్తరణ జరిగితే మాత్రం.. శ్రీకాకుళం జిల్లా నుంచి మంత్రి పదవుల కేటాయింపు పెద్ద సవాల్ గా మారనుందనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో చర్చకు దారి తీస్తోంది. అందరూ నమ్మినబంట్లే.. నమ్ముకుని ఉన్నారు.. సామాజిక కోణంలోనూ అన్యాయం చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు