TRS పార్టీకి బిగ్ షాక్ – బీజేపీలో చేరిన స్వామిగౌడ్

TRS పార్టీకి బిగ్ షాక్ - బీజేపీలో చేరిన స్వామిగౌడ్ : రెండేళ్లుగా సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నానని.. రేపు.. రేపు అంటూ చెబుతూనే ఉన్నారన్నారు. వారం క్రితం కూడా సీఎం కేసీఆర్..

జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ కు ముందు అధికార టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఉద్యమ నేత, ఉద్యోగ సంఘాల మాజీ నేత, తెలంగాణ రాష్ట్రం తొలి శాసనమండలి చైర్మన్ అయిన స్వామిగౌడ్ బీజేపీ పార్టీలో చేరారు. 20 ఏళ్లుగా టీఆర్ఎస్ పార్టీ వెంటే నడిచిన ఆయన.. సడెన్ గా బీజేపీలో జాయిన్ కావటంతో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సైతం షాక్ అయ్యాయి.

స్వామిగౌడ్ బీజేపీలో జాయిన్ అవుతూ టీఆర్ఎస్ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఏ ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం కోసం అయితే పోరాటం చేశామో.. ఆరేళ్ల తర్వాత మళ్లీ అదే అంశంపై పోరాటం చేయాల్సి రావటం బాధాకరం అన్నారు. తెలంగాణ వ్యతిరేక శక్తులు, వ్యక్తులకు ప్రాధాన్యం ఇస్తూ ఉద్యమకారులను అవమానిస్తున్నారని సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు.

తెలంగాణ ఉద్యమకారులకు కనీస మర్యాద అనేది లేదని.. నడిరోడ్డుపై నిలబెట్టటం ఏంటని ప్రశ్నించారు స్వామిగౌడ్.

ఉద్యమకారులను ఎందుకు పక్కన పెడుతున్నారో చెప్పాలని టీఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేశారు. బీజేపీ పార్టీలో ఎలాంటి పదవులు కోసం చేరలేదని.. గౌరవం కోసం వెళ్లానని చెప్పారు. తెలంగాణ ఉద్యమకారులకు గౌరవం, మర్యాద ఉంటే చాలు అన్నారు.

రెండేళ్లుగా సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నానని.. రేపు.. రేపు అంటూ చెబుతూనే ఉన్నారన్నారు. వారం క్రితం కూడా సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరానని.. అయినా దొరకలేదన్నారు. ఆత్మగౌరవానికి ఇబ్బంది కలిగినందుకే బయటకు వచ్చానని అన్నారు.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు