ఎల్.రమణకు స్వయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చంద్రబాబు.. అవకాశం ఉంటే చూసుకో అంటూ భరోసా

ఎల్.రమణకు స్వయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చంద్రబాబు.. అవకాశం ఉంటే చూసుకో అంటూ భరోసా

తెలంగాణలో మినుకు మినుకు అంటున్న తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడూ పూర్తిగా కనుమరుగు అవుతుంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే పార్టీ మారుతున్నారు. ఏడేళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్న ఎల్.రమణ.. ఉన్న పార్టీలో ఇక భవిష్యత్ లేదని నిర్ణయించుకుని దుకాణం సర్దేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధం అయ్యారు.

ఓ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న ఎల్.రమణ.. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లటానికి మంచిగా రాయబారం నడిపారు. తగిన గుర్తింపు కావాలని గట్టిగా డిమాండ్ చేశారంట. ఇందుకు తగ్గట్టుగానే గులాబీ దళం మంచి ఆఫర్ ఇచ్చింది. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చింది. ఇందుకు సంబంధించి మంత్రి ఎర్రబల్లి దయాకరరావు రూట్ క్లియర్ చేశారు. సీఎం కేసీఆర్ తో మాట్లాడి స్పష్టమైన హామీ ఇచ్చారు.

ప్రస్తుతం తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే కొత్త ఎమ్మెల్సీలను ఎంపిక చేయాల్సి ఉన్నా.. కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేసింది ఎన్నికల సంఘం. కోవిడ్ కేసులు తగ్గిన వెంటనే.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముందుకు వెళుతుంది. అప్పటికి అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఎల్.రమణ.. ఎమ్మెల్సీ పదవిని తీసుకుని టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అవుతున్నారు.

గత ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీ తరపున పోటీ చేసి 5 వేల ఓట్లు సాధించారు ఎల్.రమణ. ఆ ఎన్నికల్లో పోటీ ద్వారా తెలంగాణలో పార్టీ బలం ఏంటీ.. కార్యకర్తల మనోభావాలు ఎలా ఉన్నాయి అనేది మరోసారి పూర్తి స్పష్టతకు వచ్చిన రమణ.. పార్టీ మారి అదే ఎమ్మెల్సీ పదవి దక్కించుకుంటున్నారు.

పార్టీ మారే విషయంపై ఇప్పటికే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చెవిలో వేసినట్లు తెలిసింది. తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం వచ్చే పరిస్థితి లేదు.. కనీసం ఎమ్మెల్సీ పదవిని పార్టీ పరంగా ఇచ్చే బలమూ లేదు.. ఏ విధంగా ఇంత కంటే న్యాయం చేయలేను.. ఇక నీ ఇష్టం.. నీ దారి నువ్వు చూసుకుంటాను అంటే ఓకే అని చెప్పారంట చంద్రబాబు.

టీడీపీలోనే పుట్టాను.. టీడీపీలోనే పెరిగాను.. ఇన్నాళ్లు మీరు ఇచ్చిన గౌరవం ఇది.. మీకు చెప్పకుండా వెళ్లలేను.. మీ నిర్ణయం ప్రకారమే నిర్ణయం తీసుకుంటాను అన్నారంట ఎల్. రమణ.. దీనికి చంద్రబాబు సైతం అంగీకారం తెలిపారు. తెలంగాణ పార్టీ మనుగడ ఇక లేదన్న సంగతి అంగీకరించాల్సిందే.. ఇప్పట్లో పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టే ఆలోచన లేదు.. ఉన్న విషయం ఇది.. ఇక నీ ఇష్టం.. నీ నిర్ణయం ఏదైనా మంచిదే అన్నారు చంద్రబాబు.

చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో.. టీఆర్ఎస్ పార్టీలోకి మారేందుకు.. తన వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రమణ.. టోటల్ ఓ పార్టీ అధ్యక్షుడే పార్టీ మారి.. మరో పార్టీలో ఎమ్మెల్సీ అవుతున్నారు..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు