బీజేపీని గెలిపించండి.. ఇంటికి రూ. 25 వేలు తీసుకెళ్లండి

ప్రజలు బీజేపీ వైపు ఉన్నారని.. ఏం జరుగుతుందో వాళ్లకు తెలుసు అని అన్నారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అన్నీ తప్పుడు మాటలు, అబద్దాలు ప్రచారం చేయటమే కాకుండా ప్రత్యర్థి పార్టీలపై నకిలీ వార్తలు వేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్. వరద సాయం ఆపటంలో బీజేపీ పార్టీదే పాపం అని సీఎం కేసీఆర్ అనటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పాలబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఎదుట ప్రమాణం చేశారు. నేను కానీ.. బీజేపీ పార్టీ కానీ.. ఎవరూ డిమాండ్ చేయలేదు అని.. ఎలాంటి లేఖ రాయలేదని అమ్మవారి సాక్షిగా చెబుతూ.. జీహెచ్ఎంసీ పరిధిలో వరద నష్టానికి గురైన బాధితులకు పార్టీ అండగా నిలుస్తుందన్నారు.

జీహెచ్ఎంసీలో బీజేపీ గెలిస్తే వరద బాధితులకు 25 వేల రూపాయల పరిహారం ఇస్తామని.. ప్రతి ఇంటిని పరిశీలించి నష్టం అంచనా వేసి అందుకు తగ్గట్టుగా మరింత పరిహారం ఇస్తామని స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్, డబుల్ బెడ్ రూం ఇళ్లపై కేసీఆర్, కేటీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారాయన.
టీఆర్ఎస్ వెబ్ సైట్ నుంచి 2016 జీహెచ్ఎంసీ మేనిఫెస్టోను ఎందుకు తీసేశారని నిలదీశారు. ఓ వర్గాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో గెలవాలని టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుందని.. ప్రజలు బీజేపీ వైపు ఉన్నారని.. ఏం జరుగుతుందో వాళ్లకు తెలుసు అని అన్నారు.

హైదరాబాద్ అభివృద్ధి జరిగింది అంటే కేంద్ర ప్రభుత్వంలోని మోడీ సర్కార్ ఇచ్చిన నిధులు, విజన్ వల్లే సాధ్యం అయ్యిందన్నారు. కేంద్రం నుంచి హైదరాబాద్ కు ఎంత నిధులు వచ్చాయో చెప్పాలని.. దేనికి ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు