మనుషుల గురించి మాట్లాడితే ఓట్లు రానప్పుడు.. విగ్రహాలే దిక్కు అవుతాయి

వాళ్ల సంగతి ఏంటీ అని బాధపడే లక్షల మంది మధ్య తరగతి కుటుంబాలకు ఇది ఎంతో ఉపశమనం. అంతెందుకు..

ఏపీ రాజకీయం అంతా విగ్రహాలు చుట్టూ తిరుగుతుంది.. మతం, మనోభావాలు దెబ్బతింటున్నాయని కొందరు అంటే.. మరికొందరు రాజకీయ లబ్ధికోసం పాకులాడుతున్నారు.. అసలు వాస్తవం ఏంటీ.. తెర వెనక ఏం జరుగుతుంది అనేది ఎవ్వరికీ పట్టదు.

రాజకీయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనుషుల గురించి మాట్లాడితే ఇక ఎంత మాత్రమూ ఓట్లు పడే అవకాశం లేనప్పుడు.. విగ్రహాలు మాత్రమే ఓట్లు వేయించే అంశం ఒకటి ఉంటుంది.. దాన్నే ఇప్పుడు ఆయుధం మార్చారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఏ రాజకీయ పార్టీకి అయినా ఎదగటానికి ప్రజా సమస్యలే ఎజెండా.. ప్రజలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంటే.. దాన్ని ప్రశ్నలుగా మార్చి.. ప్రభుత్వంపై సంధిస్తుంటారు. దశాబ్దాలుగా విద్య, వైద్యం, సొంతిల్లు, మూడు పూటల నోట్లోకి నాలుగు మెతుకులు వెళ్లాయా లేదా.. ఇవే ప్రధాన సమస్యలు. ప్రస్తుతం ఏపీలో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు.. రాబోయే రోజుల్లో సొంతింటి పథకం అనేది ఏ ప్రభుత్వమూ ఇచ్చేది ఉండదు.. ముఖ్యంగా ఎర్రజెండా ఎత్తే పనే ఉండదు.. నాడు – నేడు కింద పాఠశాలలు ఎలా మారుతున్నాయో చూస్తున్నాం కాబట్టి అబద్ధం అని చెప్పలేరు.

108, 104 అంబులెన్సులతో వైద్యం ఇంటి ముంగిటకు వచ్చింది.. ప్రభుత్వ ఆస్పత్రులన్నింటికీ బాగు చేయటంతోపాటు.. ఆరు వేల మంది వైద్యులు రాబోయే ఐదేళ్లలో రాబోతున్నారు. ఇంటింటికీ నిత్యావసర సరుకులను వాహనాల్లో తీసుకొచ్చి ఇస్తున్నారు.. ప్రతినెలా ఒకటో తేదీన ఉదయం 5 గంటలకు ఇంటికొచ్చి ఫించన్ ఇచ్చి వెళుతున్నారు.

సొంతింట్లో కూర్చుని నెలనెలా వచ్చే పెన్షన్ తోపాటు విద్య, వైద్యం గడప దగ్గరకు వచ్చింది. ముఖ్యంగా వృద్ధులకు ఇది వరం. వృద్దాప్యంలో తల్లిదండ్రులను ఎలా చూడాలా అని బాధపడే మధ్య తరగతి కుటుంబాలకు ఇది నిజంగా వరం. ఎందుకంటే వయస్సులో ఉన్నాం ఏదో ఒకటి చేసుకుని బతుకుతాం.. వాళ్ల సంగతి ఏంటీ అని బాధపడే లక్షల మంది మధ్య తరగతి కుటుంబాలకు ఇది ఎంతో ఉపశమనం. అంతెందుకు అమ్మఒడి కింద 14 వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో పడుతుంటే.. మధ్య తరగతి జీవితాల్లో చదువు కొనే రోజుల నుంచి చదువుకునే రోజులు వచ్చాయని సంబర పడుతున్నారు..

ఇవన్నీ ప్రభుత్వ పథకాలను కీర్తించటం.. సీఎం జగన్ దేవుడు అని చెప్పటం కాదు మా ఉద్దేశం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ఆశలు, ఆశయాలతో బతికే ఓ సామాన్య, మధ్య తరగతి కుటుంబానికి దక్కుతున్న ఆదరణ మాత్రమే. మనిషి ఎలాగోల బతికేయొచ్చు అనుకునే రోజుల నుంచి.. ప్రశాంతంగా ఇలా బతకొచ్చు అనే స్థాయికి వస్తున్నారు.

మార్పుకు అడుగు పడిందని భావిస్తున్న ఇలాంటప్పుడు ఇక మనుషుల గురించి మాట్లాడితే ఓట్లు రానప్పుడు.. విగ్రహాలే కదా దిక్కు అయ్యేది.. అవే కదా గుడ్డిగా ఎమోషన్స్ ను తీసుకొచ్చి.. జరుగుతున్న వాస్తవాన్ని కప్పి పుచ్చేది.

ఇప్పుడు కాలం మారింది.. చరిత్ర ప్రతి ఒక్కరూ రాసుకుంటున్నారు.. నిజం శవం లాంటిది.. ఎప్పటికైనా బయటకు రావాల్సిందే.. అంతకు అంత అనుభవించాల్సిందే.. అది ఎవరైనా సరే.. ఏ మతం వారయినా.. ఏ కులం వారయినా.. దేవుడితో రాజకీయం చేసినోళ్లు కొన్ని రోజులు మాత్రమే బాగుపడ్డారు.. ఆ తర్వాత శాశ్వతంగా చరిత్రలో కనిసిపోయారు.. ఇది చరిత్ర చెబుతున్న సత్యం.. దేవుడితో గేమ్స్ వద్దు.. రాజకీయం అసలే వద్దు..

– R.A.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు