శభాష్ పోలీస్.. అర్ధ‌రాత్రి శవం కోసం బావిలోకి దిగిన ఎస్ఐ

శభాష్ పోలీస్.. అర్ధ‌రాత్రి శవం కోసం బావిలోకి దిగిన ఎస్ఐ

పోలీసులంటే లాఠీ పట్టుకొని ప్రజలను కొట్టేవారిలాగానే చాలామంది చూస్తుంటారు. అందుకే పోలీసులను చూస్తే చాలామంది భయపడతారు. పోలీస్ స్టేషన్‌కు పోవాలంటే వణికిపోతారు. కానీ పోలీసులు కేవలం కొట్టేవారు, తిట్టేవారే కాదు.. ఆపద వస్తే ముందుంటారు అని అప్పుడప్పుడూ నిరూపిస్తుంటారు కొందరు పోలీసులు..

అటువంటి వారిలో పోలీసులను శభాష్ అనేలా.. రెండు నెలల క్రితం శ్రీకాకుళం జిల్లాలో ఓ మహిళా పోలీస్ అధికారిని ఓ అనాథ శవాన్ని తన భుజపై మోసి అందరి చేత మన్ననలు పొందారు. రెండు రోజుల క్రితం విశాఖ జిల్లాలో ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని మూడు కిలోమీటర్లు తమ భుజాలపై మోసుకొచ్చారు పోలీసులు. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా ఓ పోలీస్ అధికారి బావిలోకి దిగి మృతదేహాన్ని బయటకు తీశారు. వివరాల్లోకి వెళితే వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కొత్లాపూర్‌ గ్రామానికి చెందిన రాయిపల్లి నర్సింహులు (32) అనే వ్యక్తి మంగళవారం ఎల్లమ్మ ఆలయం సమీపంలో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బావిలో దూకడాన్ని గమనించిన కొందరు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తులు వచ్చేసరికే నర్సింహులు చనిపోయాడు. అయితే బావిలోంచి మృతదేహాన్ని బయటకు తీసేందుకు అందరు భయపడ్డారు. ఈ సమయంలోనే ఓ వ్యక్తి తాండూరు పోలీసులకు సమాచారం అందించారు.

శభాష్ పోలీస్.. అర్ధ‌రాత్రి శవం కోసం బావిలోకి దిగిన ఎస్ఐ

వెంటనే స్టేషన్ సిబ్బందితో కలిసి తాండూరు ఎస్ఐ ఏడుకొండలు బావి దగ్గరకు వచ్చారు. ఎవరైనా బావిలోకి దిగాలని గ్రామస్తులను కోరారు పోలీసులు. గ్రామస్తుల్లో ఒక్కరు కూడా బావిలోకి దిగేందుకు దైర్యం చెయ్యలేదు. దీంతో ఎస్ఐ ఏడుకొండలు తాడు సాయంతో అర్థరాత్రి బావిలోకి దిగాడు. నీటిలో మునిగి వున్న మృతదేహాన్ని గుర్తించి పైకి లేపి తాళ్లు కట్టాడు. పైన ఉన్నవారు తాళ్ల సాయంతో మృతదేహాన్ని బయటకు లాగారు. అనంతరం ఎస్ఐ తాడు సాయంతో బయటకు వచ్చారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు పోలీసులు. కాగా మృతదేహాన్ని వెలికితీసే విషయంలో ఎస్ఐ చూపిన ధైర్యసాహసాలు అందరి చేత మన్ననలు పొందేలా చేశాయి. జిల్లా పోలీస్ అధికారులు ఎస్ఐ ఏడుకొండలును ప్రశంశించారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు