కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు.. అధికారులంతా వ్యాక్సిన్ పంపిణీపై రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. అంతేకాకుండా.. పంపిణీపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై ప్రధాని మోడీ కూడా ముఖ్యమంత్రులతో మంగళవారం సమావేశం కూడా నిర్వహించారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో వ్యాక్సిన్ పంపిణీపై అన్నిరకాలుగా సంసిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే అనుకున్న సమయానికి వ్యాక్సిన్ అందుబాటులోకొస్తే.. తొలుత వైద్య సిబ్బంది.. ఆ తర్వాత వృద్ధులకు అందజేయాలని నిర్ణయించారు.
ఏది ముందు..? ఎవరికి ముందు..? వ్యాక్సిన్‌పై దేశీయంగా ఆసక్తికరమైన చర్చ..
ఇక ఈ సమయంలో బ్రిటన్‌కు చెందిన ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెన్‌కా.. ఓ ఆసక్తికరమైన ప్రకటన చేసింది. వ్యాక్సిన్‌ను తొలుత మనదేశంలో పంపిణీ చేసేందుకే ప్రాధాన్యత ఇస్తామని.. సీరమ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ అదార్ పూనావాలా తాజాగా ప్రకటించారు. ఇప్పటికే 70 శాతం సత్ఫలితాలను సాధించిన తమ వ్యాక్సిన్.. 90 శాతాన్ని పాజిటివిటీని సైతం అధిగమించనున్నట్లు ఆస్ట్రాజెనెకా పేర్కొంది. దీంతో వచ్చే ఎప్రిల్ కల్లా తొలి బ్యాచ్‌ను పంపిణీ చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు కూడా నిర్వహించినట్లు తెలిపింది. అలాగే వచ్చే నెల చివరిలోగా.. ఈ వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతి లభించవచ్చని భావిస్తున్నట్లు పూనావాలా వివరించారు. అయితే ఈ వ్యాక్సిన్ రేటు కూడా వెయ్యి రూపాయల వరకు ఉంటుందని.. పెద్ద సంఖ్యలో డోస్‌లు కొనుగోలు చేయడం ద్వారా.. ఇంకా తక్కువే లభించేందుకు వీటుందని.. స్పష్టం చేశారు.
ఇటు యూఎస్ దిగ్గజాలలో ఫైజర్, మోడర్నా రూపొందించిన వ్యాక్సిన్లు కూడా సిద్ధం అవుతున్నాయి. ఇవి రెండు డోసేజీలలో వినియోగించవలసి ఉంటుందని ఆయా కంపెనీలు వెల్లడించాయి. ఫైజర్ ఇంక్ వ్యాక్సిన్ ధరను 19.5 డాలర్లుగా నిర్ణయించగా.. రెండు డోసేజీలకు 39 డాలర్లు వ్యయం కానుంది. అలాగే మోడర్నా ఇంక్ రూపొందించిన వ్యాక్సిన్ ధర మరింత అధికంగా 50 నుంచి 74 డాలర్ల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
మరోవైపు యూఎస్ కంపెనీల వ్యాక్సిన్లతో పోలిస్తే.. రష్యా నుంచి వస్తున్న స్పుత్నిక్-వి వ్యాక్సిన్ చౌకలో లభించగలదని ఆ దేశం స్పష్టం చేసింది. అంతేకాకుండా తమ వ్యాక్సిన్ సులభంగా నిల్వ చేసుకునే వెసులుబాటుతో పాటు.. పంపిణీకీ వీలుంటుందని వివరించింది. వచ్చే జులై కల్లా సీరమ్ ఇన్స్టిట్యూట్కు 40 కోట్ల డోసేజీలను ఉత్పత్తి చేయగల సామర్థ్యమున్నట్లు తెలియజేశారు. ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్ యూకేలో అనుమతి లభిస్తే.. అత్యవసర వినియోగానికి మనదేశంలోనూ ఔషధ నియంత్రణ సంస్థ నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించే వీలున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.