ఫేక్ న్యూస్ పై.. ఫేస్ బుక్ యుద్ధం – ట్రోల్ చేస్తే పేజీ ఫట్

ఫేక్ న్యూస్ పై.. ఫేస్ బుక్ యుద్ధం - ట్రోల్ చేస్తే పేజీ ఫట్

సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై నిజ నిర్థారణ చేయటానికి ఆయా కంపెనీలు పెద్ద యుద్ధమే చేస్తున్నాయి. ఇప్పటికే గూగుల్ ఫ్యాక్ట్ చెక్ రూపంలో తప్పుడు వార్తలను అరికట్టటానికి యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది. అదే బాటలో ఇప్పుడు ఫేస్ బుక్ రంగంలోకి దిగింది. ఫాల్స్ వార్తలు, ఫేక్ న్యూస్ ను కంట్రోల్ చేయటానికి పెద్ద టీం వర్క్ చేస్తోంది. దాన్ని రిజల్ట్స్ ఇప్పుడు కనిపిస్తున్నాయి.

వార్త వైరల్ కావాలన్నా.. ట్రోల్ కావాలన్నా సోషల్ ప్లాట్ ఫాం ఫేస్ బుక్ బాగా ఉపయోగపడుతుంది. నిమిషాల్లో అది కోట్ల మందికి రీచ్ అవుతుంది. అది నిజమా కాదా అనేది పక్కనపెడితే.. ముందు వార్త అయితే జనం నోట్లో నానుతుంది. తీరా అది తప్పుడు వార్త అని తేలినా.. ఆ సంగతి మాత్రం జనంలోకి వెళ్లటం లేదు. ఈ క్రమంలోనే ఫేస్ బుక్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనే అలర్ట్ ఇస్తుంది.

ఏదైనా ఒక వార్త లేదా ఫొటో లేదా వీడియో వైరల్ అవుతుంటే మాత్రం.. దాన్ని ఫేస్ బుక్ టీం పరిశీలిస్తుంది. ఈ టీం క్రాస్ చెక్ చేసుకుంటుంది. అది తప్పుడు వార్త అని ఫేస్ బుక్ నమ్మితే.. మీ వాల్ పై.. ఆ వార్తపై ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనే మెసేజ్ ను డిస్ ప్లే చేస్తోంది. పదేపదే అ పేజీలో ఇలాంటి మెసేజ్ హైలెట్ అయితే మాత్రం ఆ పేజీని తొలగిస్తుంది ఫేస్ బుక్. ఈ ఆప్షన్ ఇప్పుడు చాలా మందిని షాక్ కు గురి చేస్తోంది.

ముఖ్యంగా పొలిటికల్ లీడర్స్, న్యూస్ ఛానళ్ల వారికి ఇది గుదిబండగా మారింది. రాజకీయ పార్టీలు వారి వారి సోషల్ మీడియా టీమ్స్.. ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూ ఉంటాయి. అది తప్పుడు వార్త అయినా సరే.. దాన్ని మరో విధంగా జనంలోకి తీసుకెళ్లటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫేస్ బుక్ ద్వారా అలాంటివి సాధ్యం కాదని నిర్థారించుకున్న తర్వాత.. కొత్త మార్గాలపై అన్వేషణ చేయిస్తున్నాయి రాజకీయ పార్టీల సోషల్ మీడియా వింగ్స్.

ఇప్పటికే చాలా పొలిటికల్ పోస్టులపై ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అంటూ అలర్ట్ మెసేజ్ డిస్ ప్లే అవుతుండటంతో ఇరకాటంలో పడుతున్నారు నెటిజన్లు. ఇక ఫేస్ బుక్ సైతం భారీ ఎత్తున ఫాల్స్ న్యూస్, ఫేక్ న్యూస్ స్పెర్డ్ చేయటంపై దృష్టి పెట్టింది. మొదటి విడతలో జనరల్ పేజీలను పరిశీలిస్తున్న ఫేస్ బుక్ టీం.. ఆ తర్వాత న్యూస్ పేపర్లు, న్యూస్ ఛానళ్లు పెట్టే వార్తలపై నిఘా పెట్టనుంది. పదేపదే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అని తేలితే మాత్రం పేజీని బ్లాక్ చేయనుంది. రాబోయే రోజుల్లో ఎవరికి మూడుతుందో చూడాలి…

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు