కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టులో పిటీషన్ – ప్రభుత్వానికి నోటీసులు

ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యులన్ ఆదేశాలు ఇచ్చిందని.. అయినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని

కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి 3 TMC నీటిని పంప్ లైన్ సిస్టం ద్వారా తరలించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేశారు Ts ఇంజినీర్ ఫోరమ్ కన్వీనర్ దొంతుల లక్ష్మీ నారాయణ. దీనిపై గురువారం విచారణకు స్వీకరించి.. పూర్తి నివేదికను సమర్పించటానికి నాలుగు వారాల గడువు ఇస్తూ వాయిదా వేసింది కోర్టు. 3 టీఎంసీలను పైప్ లైన్ పద్దతి ద్వారా నీటి తరలింపు చేస్తే 8 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అదనపు భారం పడుతుందని.. దీని వల్ల ప్రతి సంవత్సరం వెయ్యి కోట్ల రూపాయల నిర్వహణ ఖర్చు అవుతుందని పిటిషనర్ కోర్టులో వాదనలు వినిపించారు.

ఇప్పటి వరకు 2 టీఎంసీల నీటి తరలింపు ప్రక్రియను కెనాల్ గ్రావిటేషనల్ టన్నల్ అండ్ లిఫ్ట్ సిస్టం ద్వారా తరలించారని.. అదే 3 టీఎంసీలను పైప్ లైన్ పద్ధతి ద్వారా తరలిస్తే భూ సేకరణ సమస్యతో పాటు, విద్యుత్ తదితర సమస్యలు ఎదురవుతాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

మూడో టీఎంసీ నీటి తరలింపును.. పాత పద్ధతి ద్వారానే పనులు చేపట్టాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి లేకుండా ప్రాజెక్టు నిర్మిచొద్దని.. ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యులన్ ఆదేశాలు ఇచ్చిందని.. అయినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని కోర్టుకు సమర్పించిన పిటీషన్ లో వివరించారు.

వాదనలు విన్న హైకోర్టు.. ప్రభుత్వంతోపాటు కాళేశ్వరం చీఫ్ ఇంజినీర్, ప్రిన్సిపల్ సెక్రెటరీ ఇర్రిగేషన్, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్, మినిస్టర్ ఎన్విరాన్ మెంటల్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ శాఖలకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. నాలుగు వారాల్లో పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి