వీ6 న్యూస్ ఛానల్ ఇన్ పుట్ ఎడిటర్ సంగప్ప బీజేపీలో జాయిన్ అవుతున్నారు. అతి త్వరలో కాషాయ కండువాతో జనంలోకి వెళ్లనున్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ అరవింద్, యువమోర్చా జాతీయ నేత లక్ష్మణ్ ఆశీస్సులతోపాటు గ్రీన్ సిగ్నల్ లభించింది. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయం వేదికగా బీజేపీ సభ్యత్వం తీసుకుని.. ప్రత్యేక రాజకీయాల్లోకి దిగుతున్నారు. 25 ఏళ్లుగా తెలంగాణ మీడియాతో మంచి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న సంగప్పకు.. పార్టీలో సైతం ఓ పదవి ఇవ్వాలని పార్టీ నేతలు భావిస్తున్నారు.
బీజేపీలో చేరే ముందే జర్నలిస్ట్ సంగప్ప రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. జమిలి ఎన్నికలు వచ్చినా లేక టైం ప్రకారం 2023లో వచ్చినా.. ఎప్పుడైనా సరే ఎమ్మెల్యే టికెట్ ఖాయం అనే హామీ తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా బరిలోకి దిగటానికి సిద్ధం అయ్యి వస్తున్నారు. ఈ మేరకు బీజేపీ పార్టీ అగ్రనేతలు హామీ ఇచ్చారు.
ప్రస్తుతం నారాయణఖేడ్ నియోజకవర్గానికి టీఆర్ఎస్ పార్టీ తరపున మహారెడ్డి భూపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ వచ్చిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కిష్టారెడ్డి గెలుపొందగా.. ఆయన అకాల మరణంతో 2016 ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మహారెడ్డి భూపారెడ్డి గెలుపొందారు. 2018లోనూ ఆయనదే విజయం.
ఈ నియోజకవర్గంలో బీజేపీకి ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేదు. టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ జరుగుతూ వస్తోంది. ఈసారి బీజేపీ తరపున ముందుగానే.. సంగప్పను రంగంలోకి దించుతోంది పార్టీ.
ఎన్నికలకు మరో ఏడాదిపైనే సమయం ఉండటంతో పార్టీతో పాటు తన విజయానికి కావాల్సిన గ్రౌండ్ ను సిద్ధం చేసుకోబోతున్నారు. బీజేపీ నుంచి ప్రస్తుతం నియోజకవర్గంలో బలమైన అభ్యర్థి లేకపోవటం.. సంగప్పకు కలిసి వచ్చే అంశం. పార్టీని బలోపేతం చేయటానికి పార్టీ వ్యూహాన్ని ముందుకు తీసుకెళ్లటానికి ఇది ఎంతో ఉపయోగంగా అంచనా వేస్తున్నారు సంగప్ప.
ఎటూ మీడియా పరిచయాలతోపాటు సోషల్ మీడియాలోనూ ఉన్న తన అనుచరులు, ఆప్తులు, సన్నిహితుల ద్వారా మంచి పునాది వేసుకోవాలని నిర్ణయించారు సంగప్ప. ఈ విధంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో బీజేపీ తరపున జెండా పాతటానికి పంతంతో బరిలోకి దిగుతున్నారు.