అవును తెలుసు.. కాంగ్రెస్ పేరుకు మాత్రమే పోటీలో ఉందని.. దాని ప్రభావం అంతంత మాత్రమే అని..
అవును తెలుసు.. ఇప్పుడు పోటీ కమలంతోనే అని.. దుబ్బాక సమరం తర్వాత ఏం జరగబోతుందో అని..
అవును తెలుసు.. ఎవరెన్ని ఎత్తులు వేసినా.. వాటికి పై ఎత్తులు వేయడంలో సీఎం కేసీఆర్.. ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ దిట్ట అని.
అందులో భాగంగానే గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పక్కా ప్లాన్‌తో వెళ్తోంది. ఎప్పుడైతే గ్రేటర్ సమరంలో బీజేపీ తీవ్ర పోటీ ఇస్తుందని తెలిసే.. టీఆర్ఎస్ నాయకుల ప్రసంగాలు పూర్తిగా మార్చేశారు. అప్పటివరకు అభివృద్ధి అజెండాతోనే వెళ్లాలనుకున్న గులాబీ శ్రేణులు.. దుబ్బాక ఎఫెక్ట్ తర్వాత.. బీజేపీని ఎదుర్కొనే క్రమంలో కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ విషయం మొన్నటి కేటీఆర్ ప్రెస్‌మీట్ చూస్తే అర్థం చేసుకోవచ్చు.. కేవలం బీజేపీని దృష్టిలో పెట్టుకునే ఆయన మీట్ ది ప్రెస్ కార్యక్రమం నడిచింది. తమ ఆరేళ్ల పాలనలో మతకల్లోలాలు లేవని.. అరాచక హైదరాబాద్ కావాలా..? శాంతియుత భాగ్యనగరం కావాలా అని స్ట్రేయిట్గానే అడిగారు.
అంతకుముందు సీఎం కేసీఆర్ ఇలాగే బీజేపీ కోణంలోనే మాట్లాడారు. బీజేపీ వస్తే అది జరుగుతుందని.. ఇది అయిపోతుందంటూ చెప్పుకొచ్చారు. దానికి బలం చేకూరుస్తూ.. బీజేపీ అలాగే వ్యవహరిస్తోంది. బస్తీమే సవాల్ అంటూ బల్దియా సమరంలోకి భాగ్యలక్ష్మీ అమ్మవారిని తీసుకొచ్చారు. దీంతో వ్యవహారం కాస్తా.. దేవుళ్లూ, మతాలు అనే వరకు వెళ్లింది. అందుకు తగ్గట్లుగానే బీజేపీ బండి సంజయ్ మాట్లాడుతూ.. గ్రేటర్ పీఠాన్ని ఎంఐఎంకు అప్పగించాలని టీఆర్ఎస్ చూస్తోందని ఆరోపణలు చేశారు.
ఇదే విషయం బీజేపీ ఎలాగైనా ప్రచారం చేస్తుందని ముందే ఊహించిన టీఆర్ఎస్ పెద్దలు.. మజ్లీస్‌తో ఎలాంటి పొత్తు లేదని తేల్చేశారు. బీజేపీతో పోటీ విషయంలో మరో మతానికి చెందిన పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఏం జరుగుతుందో.. టీఆర్ఎస్ అధినాయకత్వానికి తెలుసు. అందుకే బీజేపీని స్ట్రేయిట్‌గా ఎదుర్కొంటూనే.. తాము సెక్యూలర్ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఏదేమైనా.. ప్రజల మెదళ్లను చదివిన నాయకులు.. వారితో ఎలా వ్యవహరించాలో తెలియకుండా ఉంటుందా..? అందుకే వారికి ఎలా చెప్పాలో అలాగే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.. మన పార్టీ నాయకులు.