జీహెచ్ఎంసీ ఎన్నికలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో.. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో ఈ ఘటన చెబుతోంది. శుక్రవారం ఉదయం కూకట్ పల్లిలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తమ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. బీజేపీ తరపున గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రచారం నిర్వహిస్తుంటే.. టీఆర్ఎస్ పార్టీ తరపున ఆ పార్టీ రాష్ట్ర నేతలు పాల్గొన్నారు.
కూకట్ పల్లిలో రామాలయం వీధిలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ర్యాలీగా వస్తుంటే.. అదే సమయంలో టీఆర్ఎస్ ర్యాలీ ఎదురుపడింది. 115 బాలాజీనగర్ డివిజన్ లో బీజేపీ అభ్యర్థి చారుమతి దేవికి మద్దతుగా ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రచారం నిర్వహించగా.. అదే సమయంలో టీఆర్ ఎస్ పోటీగా ర్యాలీ నిర్వహించింది. రెండు పార్టీల కార్యకర్తలు ఎదురుపడి పోటాపోటీగా నినాదాలు చేశారు.
దీంతో ఎమ్మెల్యే రాజాసింగ్ తన ప్రచార వాహనాన్ని కాస్త ముందుకు వెళ్లాల్సిందిగా సూచించారు. ప్రచారంలో ఇవన్నీ మామూలే అని, ప్రజలు ఎవరికి ఓటేయాలో ముందే డిసైడ్ అయ్యారని, అధికార పార్టీ నేతలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఈసారి బీజేపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్.
బీజేపీ – టీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయటంతో వాగ్వాదం జరిగింది. కొంత మంది కార్యకర్తలు కొట్లాటకు దిగటంతో హై టెన్షన్ నెలకొంది. పోలీసులు అందరినీ సముదాయించి ర్యాలీలను ముందుకు కొనసాగించారు.