కరోనా హీరోస్ : వేలాది మందికి అన్నం పెట్టిన నవభారత నిర్మాణ సేన

navabharath nirman society

ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న అంటారు మదర్ థెరీసా. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో టీచర్ చెప్పిన ఈ మాటలే వారికి శిరోధార్యమయ్యాయి. అందరివీ మధ్యతరగతి కుటుంబాలే. అందరూ ప్రభుత్వ పాఠశాల ఒడిలో చదువుకున్నవారే. నీటి బుడగలాంటి ఈ జీవితాలకు ఏదో సాధించాలనే తపన వారి కళ్లల్లో.. వారి కదలికల్లో.. కనపడుతుంటుంది. నిద్రపోనీయని రాత్రుల నుంచి నిశీథిలోకి చూస్తూ.. ఆవలనున్న సత్యమార్గాన్ని అన్వేషిస్తున్నట్టు ఉండే చిరంజీవులు వాళ్లు. స్వామి వివేకానందుడు చూపిన సేవా మార్గంలోనే సత్యాన్ని తెలుసుకో గోరుతున్న వారే నవ భారత నిర్మాణ సేన కార్యకర్తలు. ‘‘మా నినాదం వందేమాతరం.. మా విధానం సమాజహితం’’ అంటున్న నవభారత నిర్మాణసేన… లాక్‌డౌన్ వేళ మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేసి వలసకూలీలకు అండగా నిలిచింది.

లాక్‌డౌన్‌తో పనులు లేక పస్తులుంటున్న జనానికి ఆహార వసతి ఏర్పాటు చేసింది. సుమారు 45 రోజుల పాటు మార్చి 25 నుంచి మొదలు కొని మే 10 వ తారీఖు వరకు నిరంతరంగా తమ సేవలను అందించింది. ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వలస కూలీలకు, నిరుపేద కుటుంబాలకు రోజూ మధ్యాహ్నం భోజనాలు అందించింది. ఈ కార్యక్రమానికి పెద్ద మనసుతో బాబీస్ ఫుడ్ కోర్టు, చైత్ర ఫుడ్ కోర్టు సాయమందించాయి. వీరు తమ వాహనాలతో పాటు వంటలు చేసి అందివ్వగా… నవభారత నిర్మాణసేన కార్యకర్తలు భోజన పంపిణీ కార్యక్రమం చేపట్టే వారు. ఆత్మీయులు, కుటుంబ సభ్యులు, పలు ప్రాంతాల్లో ఉన్న సన్నిహితులు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవడంతో ఈ కార్యక్రమం విజయవంతమైందని నవభారత నిర్మాణ సేన సభ్యులు తెలిపారు. సుమారు లక్షా 40 వేల రూపాయలు ఆర్థిక సాయం అందిందని చెప్పారు.

నవభారత నిర్మాణసేన వివరాల్లోకి వెళితే…

2008లో ‘రామదండు విజ్ఞాన సమితి’గా మొదలైన ప్రస్థానం.. చిన్ని చిన్ని అడుగులు వేసుకుంటూ 2013లో అంటే నేటికి సరిగ్గా ఏడేళ్ల క్రితం ‘నవ భారత నిర్మాణ సేన’గా రూపాంతరం చెందింది. నగరంలోని ఎల్బీ నగర్‌లో ఉన్న సిరినగర్ కాలనీ వీరి కార్యక్షేత్రం. విద్య, వినయం, విధేయత అనే మూడు మార్గాల్లో మాతృమూర్తి, మాతృభాష, మాతృదేశ సేవ కోసం నడుం కట్టారు. తల్లిదండ్రులు, గురువల నుంచి నేర్చుకున్న సద్గుణాలను పది మందికి పంచుతూ… ఆకలి కేకలు వేయని లోకం కోసం.. ఈ దేశాన్ని సురాజ్యం వైపు నడిపించే కార్యాలయంగా తమ సంస్థను మలుచుకున్నారు. ఒక పక్క చదువుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ.. మరోపక్క సామాజిక చైతన్యంతో ముందుకు సాగుతున్నారు.

విద్య కోసం ‘స్థితప్రజ్ఞ మేధోనిధి’ అనే విద్యాసంస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు చేయూతగా నిలుస్తున్నారు. విద్యార్థులకు దేశభక్తిని కలిగించేలా వందేమాతరం నినాదాన్ని విధిగా పలికిస్తారు. ఎవరు కలిసినా.. ఎవరు కనిపించినా.. వందేమాతరం అని అభివందనం చేయాల్సిందే. వందేమాతరం నినాదం.. నాటి స్వరాజ్య కాంక్షకు ప్రతిరూపం మాత్రమే కాదని.. నేటి సురాజ్య సాధనకు కూడా ముఖ్యమన్నది వీరి భావన. అంతేగాక ‘గుప్పెడు బియ్యం – పట్టెడన్నం’ కాన్సెప్ట్‌తో బియ్యం సేకరిస్తూ అనాథ గృహాలు, సేవా సంస్థలకు ఇస్తున్నారు. అలాగే ‘మనిషికి పది – మంచి పనికి’ అంటూ విరాళాలు సమకూర్చుకుంటున్నారు.

Sugerly -News,Politics,Fact Check,Viral,Life Style and Film News

ఇదిలా ఉంటే గ్రీన్ హిల్స్ కాలనీలోని పూజలకు దూరంగా.. శిథిలావస్థలో ఉన్న సాయిబాబా ఆలయాన్ని గుర్తించి.. స్థానిక కాలనీవాసుల సహకారంతో ధూప,దీప, నైవేద్యాల స్థాయికి తీసుకొచ్చారు. ప్రతి నెలా మొదటి ఆదివారం సమావేశమై తమ కార్యకలాపాలను సమీక్షించుకుంటూ.. భవిష్యత్తు వైపు అడుగులు వేస్తుంటారు. ఒకవేళ ఎవరైనా దూరంగా ఉన్న టెలీకాన్ఫరెన్స్ ద్వారా వారిని కూడా అందుబాటులోకి తెచ్చుకుని.. తమ కార్యకలాపాలపై పూర్తి సమీక్షగా వెళుతున్నారు.

ఈ సంస్థలో సతీశ్ సూర్యనారాయణ, రామకృష్ణ శర్మ, మణికంఠ, ఉమేశ్ కుమార్, వినయ్ కుమార్, సంతోష్, సాయి చైతన్య, పవన్ కుమార్, సాయికృష్ణ, బద్రి, రామకృష్ణ, విజయ్, శ్రీకాంత్.. లావణ్య, రేణుక, శ్రావణి నాగజ్యోతి, అలివేలు మంగ, అరుణ, వరంగల్ భవాని, దీపికా దేవి శాశ్వత సభ్యులు కాగా, ఝాన్సీ, సంగీత, మౌనిక, మాధురి, నూర్ ఫాతిమా, శ్రావణి తదితరులు కార్యకర్తలుగా తమ సేవలు అందిస్తున్నారు. అలాగే ట్యూషన్ నిర్వహణ కోసం లఖన్, మహేశ్, నరేశ్, రమేశ్, సుధీర్ బీకుమాండ్ల, రాజారామన్న, నాగరాజు లాంటి ఉద్యోగులు తమ సమయాన్ని కేటాయించి పిల్లల చదువులకు, నవభారత నిర్మాణసేనకు తమవంతు తోడ్పాటును అందిస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు